క‌రోనా క‌ల‌క‌లం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన‌సాగుతోంది. ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతుండగా వేలాది మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దేశాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా వైర‌స్ వ్యాప్తి జ‌రిగిపోతోంది. మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. కానీ....ఈ విష‌యంలో సంచ‌ల‌న ప‌రిణామం వెలుగులోకి వ‌చ్చింది. అగ్ర‌రాజ్యం అమెరికా కరోనా చావుల్లో మాత్రం నల్లజాతి వారే ఎక్కువ‌గా ఉంటున్నారని స్ప‌ష్ట‌మైంది. 

 

 

ఏపీఎం రిసెర్చ్ ల్యాబ్ జరిపిన అధ్యయనంలో తెల్లవారి కన్నా నల్లవారు మూడింతలు మరణించారని తెలిసింది. కలర్ ఆఫ్ కరోనా వైరస్ అనే పేరుతో ఆ నివేదికను విడుదల చేశారు. లక్షమందికి మరణాల రేటు నల్లజాతివారిదే అధికంగా ఉండడం ఇందుకు ఒక కారణం. తెల్లవారు లక్షకు 20.7 మంది, లాటినోలు 22.9 మంది, ఆసియా సంతతివారు 22.7 మది మరణించగా నల్లజాతివారు 50.3 మంది మరణించారు. మొత్తంగా చూస్తే 20 వేలమందికి పైగా నల్లజాతివారు కరోనాతో మరణించారు. నల్లజాతి జనాభాను బట్టి చూస్తే ప్రతి 2000 మందిలో ఒకరు మరణించారు. 

 

మ‌రోవైపు విడివిడిగా రాష్ట్రాలను గమనిస్తే కాన్సస్‌లో తెల్లవారి కన్నా ఏడురెట్లు నల్లజాతివారు మరణించారు. వాషింగ్టన్‌లో ఆరింతలు మరణించారు. మోంటానా, ఊటా, నెబ్రాస్కా వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ జాతులవారీగా కరోనా జాబితాలు ఇవ్వడం లేదు. నల్లజాతివారికి ఉపశమనం కలిగించేందుకు ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురువుతున్నదనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితి తక్షణం దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని సూచిస్తున్నదని అధికారులు అంటున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, చైనాపై మ‌ళ్లీ ట్రంప్ మండ్డిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వంపై చైనా దుష్ప్ర‌చారం చేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ఆరోపించారు. ఈ ఏడాది జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో...డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌ను గెలిపించేందుకు చైనా స‌హ‌క‌రిస్తున్న‌ట్లు ట్రంప్ విమ‌ర్శ‌లు చేశారు. అందుకే ఆ దేశం త‌మ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. వైర‌స్ ప‌ట్ల చైనా ప్ర‌తినిధి మాట్లాడిన అంశాల‌ను కూడా ట్రంప్ కొట్టిపారేశారు.  చైనా వ‌ల్లే ప్ర‌పంచం అంతా ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: