జూన్  1 నుంచి రైలు కూత మొదలు కానుంది. దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్న రైల్‌ సర్వీసులకు సంబంధించి గైడ్ లైన్స్ కూడా విడుదలయ్యాయి. 200 రైళ్ల వివరాలను రైల్వే శాఖ రిలీజ్‌ చేసింది.

 

దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు యాభై రోజులుగా నిలిచిపోయిన రైలు సర్వీసులు .. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్ బుకింగ్స్, రిజర్వేషన్స్‌, టికెట్ రాయితీలు, టికెట్ రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించే రుసుము, హెల్త్‌ చెకప్స్‌, ఆహార సదుపాయాలు, రైళ్లలో దుప్పట్లు తదితర అంశాలకు సంబంధించి నిబంధనలు విడుదలయ్యాయి. ఇక, ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో టికెట్ ల బుకింగ్ కూడా అందుబాటులోకి రానుంది. 

 

200 రైళ్లకు సంబంధించిన వివరాలు రిలీజ్‌ చేసిన రైల్వేశాఖ... ఏ ట్రైన్‌లోనూ జనరల్ బోగీలు ఉండబోవని స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఛార్జీలనే వసూలు చేస్తామని,  ప్రయాణీకులందరికీ సీట్లు లభించేలా చూస్తామని, అంతకు మించిన రద్దీ ఉంటే  ప్రయాణికులకు అనుమతి ఉండదని ప్రకటించింది.  

 

రైల్వే స్టేషన్ లలో టికెట్ బుకింగ్ సెంటర్ లలో అమ్మకాలు ఉండవు.  ఒక నెల ముందు మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే వీలుంటుంది. టికెట్ బుకింగ్స్ కు గరిష్ట కాలపరిమితి 30 రోజులు మాత్రమే.  కన్ఫార్మ్ టికెట్ లు ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది.  రైళ్లలో కి ప్రవేశించే ముందు  ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేశారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారికే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు.

 

ఇక  వికలాంగుల కు నాలుగు కేటగిరీల కింద, దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడే వారికి 11 కేటగిరీల కింద టికెట్ల ధరలలో రాయితీ ఇస్తారు. ప్రయాణీకులు తమ స్వస్థలాలకు చేరిన తర్వాత ఆయా రాష్ట్రాలు విధించే నిబంధనలు పాటించాలి.  ఈ రైళ్లలో ఎటువంటి దుప్పట్లు, బ్లాంకెట్లు సరఫరా చేయబోమని రైల్వే శాఖ ప్రకటించింది. 

 

RAC లేదా వెయిటింగ్ లిస్ట్ విధానం ఈ రైళ్లలో ఉన్నప్పటికీ... టిక్కెట్‌ కన్ఫామ్‌ అయినవారికే రైల్వే స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది. కన్ఫార్మ్ టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణికుడు ఆరోగ్యంగా లేకపోతే ప్రయాణానికి అనుమతి ఉండదు.. అలాంటి ప్రయాణికుడి టికెట్ రద్దు కాదు, డబ్బులు తిరిగి రావు. 

 

ప్రయాణంలో ఉన్నప్పుడు రైలు లో ఖాళీ సీట్లు ఉన్నప్పటికీ టికెట్ లు జారీ చేసే అధికారం టీసీ లకు ఉండదు.  తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ లు అందుబాటులో ఉండవు.  ఖరారయిన టికెట్ ల జాబితా రైలు ప్రయాణాని కంటే నాలుగు గంటల ముందు, తుది జాబితా రెండు గంటల ముందు ప్రకటిస్తారు.  ప్రయాణికులు సాధ్యమైనంతవరకు తమ సొంత ఆహార పదార్ధాలను వెంట తెచ్చుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: