పశ్చిమబెంగాల్‌, ఒడిశాల‌ను ఉంపన్‌ తుపాను అత‌లాకులం చేసింది. తీవ్ర‌స్థాయిలో న‌ష్టం వాటిల్లింది. ప్ర‌ధానంగా ప‌శ్చిమ‌బెంగాల్లో 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బ‌తిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్‌ దాటికి మహానగరం కోల్‌కతా అత‌లాకుత‌ల‌మైంది. ఈ నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్‌ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌తోపాటు మిగ‌తా ప్రాంతాల‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలను చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నామ‌ని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండ‌గా.. ఉంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. ఈ మేర‌కు అధికార‌వ‌ర్గాలు వివ‌రాలు వెల్ల‌డించాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్‌ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్‌ సర్వే ద్వారా  పరిస్థితుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. అలాగే.. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌లతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు.

 

నిన్న బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ మాట్లాడుతూ.. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్‌ తుపాను కోవిడ్‌–19 కంటే భయంకరమైనదని అన్నారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదని అమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని... ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయాల‌ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్‌ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలని కోరిన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: