దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. గత ఐదు రోజుల నుంచి దేశంలో ప్రతిరోజూ 5000కు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో చాలామంది ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల 173 జవహర్​ నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరిని సొంతూళ్లకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం తాజా నిర్ణయంతో వేరువేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 3169 మందికి ఉపశమనం లభించింది. కేంద్ర మానవవనరుల శాఖ నవోదయ విద్యాలయాల్లో చిక్కుకుపోయిన వారిని సొంతూళ్లకు తరలించేందుకు సిద్ధమైంది. కరోనా విజృంభణతో మార్చి 21 నుంచి జవహర్ నవోదయ విద్యాలయాలను మూసేశారు. 
 
లాక్ డౌన్ విధించే సమయానికి చాలామంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోగా స‌మ్మ‌ర్ ట్రైనింగ్ క్లాసెస్ వల్ల కొంతమంది విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. అలా ఉండిపోయిన వాళ్లను ఇళ్లకు పంపించేందుకు తాజాగా కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ అమలవుతోంది. నాలుగో విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. 
 
రాష్ట్రాల అంగీకారంతో ఇతర రాష్ట్రాలకు బస్సులు నడుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. కరోనాకు వ్యాక్సిన్, మందులు అందుబాటులోకి రాకపోవడంతో ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పక ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కేంద్రం సూచిస్తోంది. మరోవైపు దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా భారీన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: