తెలంగాణలో రైతు రాజ్యం నెల‌కొల్ప‌డ‌మే ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంక‌ల్పం. ఒక‌వైపు అనేక సాగునీటి ప్రాజెక్టులు చేప‌డుతూనే.. మ‌రోవైపు అన్న‌దాత‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇప్ప‌టికే రైతుబంధు, రైతుబీమా త‌దిత‌ర అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి అనేక రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. తాజాగా.. పంట‌ల సాగులోనూ స‌మూల మార్ప‌లు తెచ్చేందుకు ఆయ‌న కృషి చేస్తున్నారు. ఈ మేర‌కు ప‌క‌డ్బందీ కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తున్నారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వందశాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని నిన్న జరిగిన అధికారులు, మంత్రుల స‌మావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

 

మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగిన, నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందే అవ‌కాశం ఉంటుంద‌ని వెల్లడించారు. తెలంగాణ‌లో గతేడాది వానకాలంలో వరి పంట 40 లక్షల ఎకరాల్లో సాగుచేశారని, ఈ సారి కూడా అంతే విస్తీర్ణంలో సాగుచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. అదేవిధంగా గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసారని, ఈ సారి 70 లక్షల ఎకరాల్లో సాగుచేయాలన్నారు. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది సాగుచేయ‌గా.. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగుచేయాలని ఇటీవ‌ల కేసీఆర్ చెప్పిన విష‌యం తెలిసిందే. సోయాబీన్‌, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చున‌ని ఆయ‌న సూచించారు.

 

వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగుచేసుకోవచ్చు. వానకాలంలో మక్కలసాగు లాభసాటి కాదని.. అందుకే సాగు చేయవద్దని ఆయ‌న సూచిస్తున్నారు. యాసంగిలో మక్కలు సాగుచేసుకోవచ్చున‌ని చెబుతున్నారు. వానకాలంలో మక్కలు వేసే అలవాటున్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలని ఆయ‌న అంటున్నారు. వరి వంగడాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని... మార్కెట్లో డిమాండ్‌ ఉన్న రకాలు వేసుకోవాలని... తెలంగాణ సోనాకు డిమాండ్‌ ఉన్నదని... ఆ రకం పండించాలని కేసీఆర్ చెప్పారు. అయితే..6.5 మిల్లీమీటర్ల సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయంగా మార్కెట్‌ ఉన్నదని.. కాబట్టి ఆ రకం పండించాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

అంతేగాకుండా.. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడంకోసమే పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను, సెజ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నదని సీఎం వెల్లడించారు. నిజానికి.. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా పంట‌ల సాగుపై ఇలా దృష్టి సారించ‌లేద‌ని.. కేసీఆర్ తెలంగాణ‌లో అద్భుతాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: