తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కీల‌క స‌మ‌యంలో తాను ముందుండి న‌డిపించే బాధ్య‌త‌ను తీసుకున్న గులాబీ ద‌ళ‌ప‌తి ఈ క్ర‌మంలో త‌న జేబులో నుంచి డ‌బ్బులు ఖ‌ర్చు చేసేందుకు సైతం ముందుకు వ‌చ్చారు. అది కూడా త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ఫార్మ్‌హౌస్‌లో ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ముఖ్య‌మైన వేదిక‌ను నిర్మించ‌నున్నారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసే విధానంపై చర్చించడానికి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీనియర్‌ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ వర్సిటీ అధికారులు, సైంటిస్టులు పాల్గొన్నారు. జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. సందేహాలను నివృత్తి చేశారు. వారినుంచి సూచనలు స్వీకరించారు. 

 


ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా తెలంగాణ రైతులు ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వందశాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని ఆయ‌న వెల్ల‌డించారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగిన, నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని వెల్లడించారు. ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగుచేస్తే రైతుకు ఏ ఇబ్బందీ ఉండదని చెప్పారు. విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వంలాంటి అనుకూలతలను సద్వినియోగం చేసుకుని ప్రపంచంతో పోటీపడే గొప్ప రైతాంగంలా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విత్తనాల కల్తీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విత్తన కల్తీదారులు హంతకులతో సమానమని హెచ్చరించారు. కల్తీ విత్తనాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, ప్రజా ప్రతినిధులు కల్తీ విత్తన విక్రేతలను కాపాడే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. 

 

ఈ సంద‌ర్భంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. తన వ్యవసాయ క్షేత్రమున్న ఎర్రవల్లిలో  సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమీక్షా సమావేశంలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న కీల‌క నిర్ణ‌యం నేప‌థ్యంలో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర మంత్రులంతా తలా ఒక రైతువేదికను సొంత ఖర్చులతో నిర్మించడానికి ముందుకొచ్చారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి,  పౌరసరఫరాలసంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కొందరు జిల్లాల రైతు బంధు అధ్యక్షులు కూడా రైతువేదికలు నిర్మించడానికి ముందుకొచ్చారు. రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతువేదికల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఏఈవోకు కార్యాలయం, కంప్యూటర్‌, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకోవడానికి వీలుగా టీవీ వంటి ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. రైతువేదికలకు.. స్థలం లేదా నగదు విరాళంగా ఇచ్చిన వారు సూచించిన పేర్లు పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: