వరంగల్ జిల్లాలోని గీనుకొండ బావిలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న 4 మృతదేహాలు బయటపడగా ఈరోజు మరో 4 మృతదేహాలు బయటపడటంతో మృతదేహాల సంఖ్య 8కు చేరింది. పాతికేళ్ల క్రితం బెంగాల్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన కుటుంబంలో జరిగిన ఘోర విషాదమిది. బావిలో నుంచి ఎనిమిది మృతదేహాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
వలస కార్మికుల మృతి విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన మృతదేహాలు కావడంతో హత్యలా...? ఆత్మహత్యలా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మక్సూద్ అనే వ్యక్తి కుటుంబం 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. మక్సూద్ కు భార్య నిషా, ఇద్దరు కుమారులు, కుమార్తె బుస్రా ఉన్నారు. మక్సూద్ కుమార్తెకు ఐదేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా కొన్ని కారణాల వల్ల ఆమె భర్తతో విడిపోయింది. 
 
ఆమె మూడేళ్ల బాబుతో పుట్టింట్లో ఉంటోంది.మక్సూద్ కుమారుడు సోహెల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతుండగా, చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. ఈ కుటుంబంతో పాటు బీహార్ కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం అక్కడే గోదాంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న లభించిన మృతదేహాల్లో ఇద్దరు మక్సూద్ కుమారులు కాగా మరో ఇద్దరు బీహార్ యువకులని తెలుస్తోంది. 
 
మక్సూద్ కుటుంబం, బీహార్ యువకుల ఆత్మహత్యలకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అయితే పోస్టుమార్టం నివేదిక తరువాతే అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. మక్సూద్‌ మనవడి పుట్టిన రోజు వేడుక సమయంలో మక్సూద్ కుమార్తె విషయంలో బీహార్ యువకులు, స్థానిక యువకుల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ గొడవ వల్లే వీరిపై విష ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తరువాత అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: