తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు రెండో భార్య నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి, టీడీపీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం అనే సంద‌ర్భం నాటి నుంచి మొద‌లైన ఈ విబేధాలు ఈనాటికి కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలిగా ల‌క్ష్మీపార్వ‌తి రాజ‌కీయ జీవితం కొన‌సాగిస్తున్నారు. ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ హోదాను ఏపీ ప్ర‌భుత్వం నందమూరి లక్ష్మీపార్వతికి క‌ట్టబెట్టింది. తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

 

స్వార్ధపరుడు అధికారంలోకి వస్తే తను, తనవాళ్లు బాగుపడతారని పేర్కొన్న ల‌క్ష్మీపార్వ‌తి ఒక ఆశయమున్న వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రజలు బాగుపడతారని తెలిపారు. ``40 సంవత్సరాల ఇండస్ర్టీ అని చెప్పుకొనే చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏమీ చేయలేదనే విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించారు కాబ‌ట్టే గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యే తీర్పు ఇచ్చారు. మంచి విజన్ ఉన్న నాయకుడు అధికారంలోకి వస్తే రాష్ర్టం ఏ విదంగా ముందుకు వెళ్తుంది,ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుందనేందుకు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే వైయస్ జగన్ నిరూపించారు. పార్టీ, మతం, కులం, ప్రాంతం, రాజకీయాలు అనేవి లేకుండా అన్నింటికి అతీతమైన స్ధితిలో పరిపాలన ఎలా సాగుతుందో ఈ సంవత్సరంలోనే జగన్ గారి పాలనలో చూడగలిగాం. `` అని ల‌క్ష్మీపార్వ‌తి అన్నారు.

 

ఈ సంద‌ర్భంగా చంద్రబాబుకు తాను ఓ విష‌యం చెప్ప‌ద‌లుచుకున్నాన‌ని ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. ``చంద్ర‌బాబు...నీకు 72 ఏళ్ల వయస్సు దాటిపోయింది. వృధ్ధాప్యం వచ్చేసింది. మన ధర్మం చెబుతున్నట్లు, వయస్సు పైబడిన తర్వాత కృష్ణా...రామా....అనుకుంటూ ప్రశాంత జీవితం గడపండి. ఇప్పటికే ఎన్నో పాపాలు చేసి ఉంటారు. ఈ పాపాలన్నీ పోవాలంటే చివరి వయస్సులోనైనా దైవాన్ని గురించి ఆలోచించండి. అధ్యాత్మికమార్గంలో పయనించాలని మన ధర్మం చెబుతోంది. ఈ వయస్సులో పురాణాలు చదువుకో. పురాణాలు చెప్పే పండితులను పిలిపించుకో....చాగంటి లాంటి వారి ప్రవచనాలు విను....లేదా నన్ను రమ్మని పిలిచినా ఒక అత్తగా వచ్చి  భగవధ్గీత రోజూ చెబుతాను. `` అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: