ఇప్పుడంతా క‌రోనా క‌ష్టాల గురించే చ‌ర్చ‌. సుదీర్ఘ కాలం అనుభ‌వించిన లాక్ డౌన్ క‌ష్టాల‌కు తెర‌ప‌డుతూ...స‌డ‌లింపుల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేస్తూ కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. అయితే, క‌రోనా క‌ష్టాలు ఇంకా తొల‌గిపోలేదు. ఈ మ‌హ‌మ్మారితో క‌లిసి జీవితం గ‌డ‌పాల్సిందేన‌ని పాల‌కులు చెప్తున్నారు. అయితే, ఈ మ‌హమ్మారి కార‌ణంగా అనేక‌మంది క‌ల‌లు క‌ల్ల‌లు అవుతున్నాయి. తాజా ఉదంతం ఇదే. ఈ ఏడాది ఐటి రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఉండకపోవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టివి మోహన్‌దాస్‌ పాయ్ విశ్లేషించారు. 

 

ఐటీ రంగంలో దీర్ఘ‌కాల అనుభ‌వం క‌లిగిన మోహ‌న్‌దాస్ పాయ్ తాజా ప‌రిణామాల‌ను విశ్లేషిస్తూ కరోనా ప్రతికూల ప్రభావం కారణంగా అనేక మంది ఉద్యోగాల‌కు దూరం కానున్నార‌ని అన్నారు. కొత్త వారి విష‌యంలో ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు. ఇప్పటికే హామీ ఇచ్చిన వారికి మాత్రం ఆయా సంస్థలు నియామకాలు కల్పించనున్నాయన్నారు. ఐటి కంపెనీల క్లయింట్లు కూడా చాలా వరకు తమ కార్యాలయాలను తెరవలేదన్నారు. దీంతో వచ్చే రెండు మూడు త్రైమాసికల వరకు ఎటువంటి నియామాకాలు జరగబోవని చెప్పారు. ఒక వేళ ఎవరైనా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ స్థానాన్ని భర్తి చేయకపోవచ్చని పాయ్‌ పేర్కొన్నారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 20-25 శాతం కోత ఉండొచ్చన్నారు. ఇక ఉద్యోగంలో పదోన్నతి ఉన్నప్పటికీ జీతాల పెంపు మాత్రం ఉండకపోవచ్చని మ‌రో దుర్వార్త‌ను పాయ్ వెల్ల‌డించారు. 

 

లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఐటీ పరిశ్రమలోని 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారని మోహ‌న్‌దాస్ పాయ్‌ తెలిపారు. ఉద్యోగుల ఇళ్లలో మౌలిక సదుపాయల కల్పన, ఆయా కంపెనీల క్లయింట్ల నుంచి భద్రతాపరమైన అనుమతి లభించడంతో ఇంటి నుంచే పని విజయవంతంగా కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయమని కోరనున్నాయ‌ని అన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ 25 నుంచి 30 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచే పనికి అనుమతించే అవకాశాలున్నాయ‌ని మోహ‌న్‌దాస్ పాయ్ విశ్లేషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: