ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు హైకోర్టు వరుస షాకులు ఇస్తోంది. ఈరోజు జగన్ సర్కార్ జారీ చేసిన రంగుల జీవోపై, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై, సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు పిటిషన్ వేసిన వారికే అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. 
 
తాజాగా ఏపీలో మార్చి, ఏప్రిల్ నెలలకు ఒకే బిల్లులు ఇవ్వటంపై పిటిషన్ దాఖలైంది. రెండు నెలలకు ఒకే బిల్లు ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఏబిసి టారిఫ్ యూనిట్ లలో పలు మార్పులు చేశారని, అందువల్లే కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగాయని పిటిషనర్ వాదించాడు. రెండు నెలలకు ఒకేసారి బిల్లు ఇవ్వడం వల్ల స్లాబ్ మారిపోయి కరెంట్ బిల్లు అధికంగా వచ్చిందని పిటిషనర్ వాదనలు వినిపించాడు. 
 
హైకోర్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జి, ఏపీ ప్రభుత్వం, ఏపి ట్రాన్స్ కో, ఏపి జన్ కో, ఏపిఎస్పిడిసిఎల్, ఏపిఇపిడిపిఎల్, ఏపిఇఆర్పీలు మూడు వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విద్యుత్ బిల్లుల అంశం గురించి కోర్టుకు విచారణకు స్వీకరించడంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది. విద్యుత్ శాఖ, ప్రభుత్వం తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని... లాక్ డౌన్ వల్ల వినియోగం పెరిగి ఎక్కువ మొత్తంలో కరెంట్ బిల్లులు వచ్చాయని చెబుతోంది. 
 
మరి హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ పిటిషన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం మరలా విద్యుత్ బిల్లుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ బిల్లుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరి ఈ పిటిషన్ లో ఎలాంటి తీర్పు వస్తుందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: