రోహిణి కార్తె రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు ఉన్నాయి. వడగాలులకు తెలుగురాష్ట్రాల జనం బెంబేలెత్తిపోతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని, జనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. 

 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండలోకి వెళితే మాడు పగులుతోంది. ఇంటిపట్టున ఉన్నా వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తుఫాను ప్రభావం వల్ల గాలిలో తేమ తగ్గిపోవడమే ఎండల తీవ్రతకు కారణమంటున్నారు వాతావరణ అధికారులు. తెలంగాణలో  హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, భూపాలపల్లి, సూర్యాపేట ప్రాంతాల్లోనూ ఎండల తీవ్ర ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 42 డిగ్రీలు, మిగిలిన ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందంటున్నారు అధికారులు.

 

ఏపీలో రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకున్నాయి. వచ్చే నాలుగు రోజుల్లో గుంటూరు జిల్లా రెంటచింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు‌ నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.  రెంటచింతలలో 47 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు  నమోదయ్యాయి.  

 

ప్రజలు ఎండల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ నిపుణులు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచించారు నిపుణులు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

 

మొత్తానికి సూర్యుడు తన ప్రతాపమేంటో చూపించేస్తున్నాడు. కరోనా వైరస్ ఇప్పటికే ప్రజలను ఇబ్బంది పాలు చేయగా.. బయట అడుగుపెడితే చాలు సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చెమటలు పట్టించడమే కాదు.. దెబ్బకు దాహం తెప్పిస్తున్నాడు. ప్రజలు బయటికి వెళ్లేటపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే సూర్యుడి ఉగ్రరూపానికి బలికావాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 

మరింత సమాచారం తెలుసుకోండి: