దశాబ్దాలుగా భారత్ - నేపాల్‌లు మిత్రదేశాలు..! సరిహద్దుల్లో రాకపోకలు... ప్రజల మధ్య సంబంధాలు అంతా స్నేహపూర్వకంగానే సాగుతూ వచ్చాయి...! కానీ ఇప్పుడు మనదేశం పేరు చెబితే  నేపాల్ ఒంటి కాలుపై లేస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగంలో చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన నేపాల్ భారత్‌తో కయ్యానికి సిద్ధమవుతోంది.

 

భారత్‌ - నేపాల్ మధ్య భూ వివాదాన్ని అర్ధం చేసుకోవాలంటే ఉత్తరాఖండ్ సరిహద్దుల వరకు వెళ్లాలి. 
ఉత్తరాఖండ్‌తో నేపాల్ వందల కిలో మీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. హిమాలయ పర్వత శ్రేణులను తలపించే కొండ ప్రాంతమిది....లింపాధురియా, కాలాపానీ, లిపులేఖ్‌లు ఈ మూడు ప్రాంతాలే ఇప్పుడు రెండు దేశాల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి.  దీన్ని ట్రై జంక్షన్‌గా చెప్పుకుంటారు. భారత్ నేపాల్ చైనా మూడు ప్రాంతాల సరిహద్దులు ఇక్కడే ఉంటాయి. 

 

రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిన ఈ ప్రాంతంలోనే మహాకాళి, గండక్‌ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులు నిత్యం తమ మార్గాన్ని మార్చుకుంటూ కొండ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉండటం వల్ల రెండు దేశాలకు కచ్చితంగా సరిహద్దు రాయిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే గత సంవత్సరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. అందులో ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ఉన్న కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను భారత్‌లోనే ఉన్నట్లు చూపించారు.

 

మానస సరోవర్ యాత్రకు వెళ్లే భారతీయులకు అనువుగా ఉండేందుకు లిపులేఖ్ పాస్ వద్ద ఇటీవల 
భారత ప్రభుత్వం రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఖాట్మండ్‌ రగిలిపోతోంది. లిపులేఖ్‌ పాస్‌ మీదుగా ఉత్తరాఖండ్‌ నుంచి మానసరోవర్‌కు వెళ్లే రహదారిని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మే 8న ప్రారంభించడంతో సరిహద్దుల విషయంలో నేపాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహాకాళి నది మొదలయ్యేది లింపియాధురాలోనేనని ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం పొలిటికల్ మ్యాప్‌ను ఉన్న పళంగా మార్చేసింది. 

 

కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపించే అధికారిక రాజకీయ మ్యాప్‌ను నేపాల్ కేబినెట్ ఇటీవలే ఆమోదించింది. తమకు చెందే భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోబోమంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రకటించారు. ఈ మొత్తం పర్వత ప్రాంతం తమ దేశంలోనిదేనని... రాయబార కార్యాలయం ద్వారా భారత్‌కు నేపాల్ ప్రభుత్వం లేఖ కూడా పంపింది. తమ భూభాగంలోకి భారత్ ప్రభుత్వం 22 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించిందని నేపాల్ ఆరోపిస్తోంది. తమ భూభాగాన్ని రక్షించుకునే విషయంలో భారత్‌తో ఎంతవరకైనా వెళ్తామంటోంది నేపాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: