లాక్ డౌన్ విపత్తుతో కుదేలైన MSMEలకు ఊరట నిచ్చేలా ఏపీ ప్రభుత్వం.. ప్యాకేజి ప్రకటించింది. MSMEలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్న ఏపీ సీఎం జగన్.. ఈ రంగం బాధ్యతలను జిల్లాల్లో మూడో జేసీకి అప్పగించారు. నిరుద్యోగం పెరుగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 450 కోట్ల రూపాయలనూ విడుదల చేశారు.

 

కరోనా విపత్తువేళ, లాక్‌ డౌన్‌తో MSMEలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకూ ప్యాకప్ చెప్పే స్థితికి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో MSMEలను ఆదుకునేందుకు.. ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. 11 వందల పది కోట్ల రూపాయలతో రిస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది. దీనికి తోడు గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్లో 450కోట్లను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. మిగిలిన భాగాన్ని వచ్చేనెల 29న విడుదల చేస్తామన్నారు. MSMEలు తమ కాళ్లపై నిలబడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు .. ఆదేశాలు జారీ చేశారు. 

 

రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ కోసం.. 200 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ఆదేశించారు. మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్‌డ్‌ చార్జీలు రద్దు చేశారు. ప్రభుత్వానికి అవసరమైన 25శాతం వస్తువులు, సామగ్రి మొత్తం 360 రకాలు.. MSMEల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. క్యాంప్‌ ఆఫీసులో జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం నిధులు విడుదల చేశారు. 

 

జిల్లాల్లో మూడో జేసీకి MSMEల బాధ్యత అప్పగించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. రాష్ట్రంలోని 98 వేల MSMEల ద్వారా పదిలక్షల మందికి ఉపాధి లభిస్తోందని.. వాటిని కాపాడుకోవాలన్నారు జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. MSMEల సంక్షేమం కోసం బకాయిలు విడుదల చేస్తున్నట్లు ఏపీసీఎం తెలిపారు.

 

ప్రభుత్వం ప్రోత్సాహకం విడుదల చేయడంపై.. MSMEల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కష్టాల నుంచి బయటపడి ...రాష్ట్ర అభివృద్ధిలో తమవంతుపాత్ర పోషిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: