ఏపీ తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువ నుంచి 2టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. జలసౌధలో జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు జలాల పంపిణీపై చర్చించారు. 

 

ఏపీకి తాగునీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. సాగర్ కుడి కాలువ నుంచి 2 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తాగునీటి కోసం రాష్ట్రాల మధ్య పరస్పర అభ్యర్థనలు, అంగీకారాలు సాధారణమే. అయితే పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోతో రెండురాష్ట్రాల మధ్య పంచాయితీ మొదలైంది. ఈ జలవివాదంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అభ్యర్థనపై రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి తాగునీటి అవసరాల కోసం ఏపీకి 2 టిఎంసిల నీరు ఇచ్చేందుకు అంగీకరించామని తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ తెలిపారు.

 

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో జలవివాదాల అంశం చర్చకు వస్తుందని భావించినప్పటికీ ఆ ప్రస్తావనేమీ రాలేదని తెలుస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీరు అవసరమైందని, గతంలో త్రిసభ్య కమటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం నీటి విడుదల కోరామని ఏపీ చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి  మీటింగ్ తర్వాత చెప్పారు. నీళ్ల విషయంలో ఏపీ కోటా అయిపోయిందని బోర్డుకు తెలంగాణ లేఖ రాయటం సరైంది కాదని, తమకు రావాల్సిన నీటి కోసం రిలీజ్ ఆర్డర్స్ ఇవ్వటానికి బోర్డు కార్యదర్శి ఒప్పుకున్నారని చెప్పారు. సాగర్, శ్రీశైలం నుంచి తమకు రావాల్సిన నీటిని మాత్రమే తీసుకెళ్తామన్నారు  ఏపీ చీఫ్ ఇంజనీర్.

 

మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డు కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు జలాల పంపిణీపై చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: