అసలే ఇప్పుడు కరోనా కాలం.. ఏ రంగం చూసినా ఈసురో మంటోంది. అలాంటి ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గ సహచరుడు ఒకరిపై కొండంత బరువు పెట్టారు. అదేంటంటే.. ఈ కష్టకాలంలో విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం.. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్శించేందుకు ఏపీ సర్కారు ఓ టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ కు పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి నాయకత్వం వహిస్తారు.

 

 

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, ఇంధన, ఐటీ శాఖ కార్యదర్శులు శ్రీకాంత్‌, కోన శశిధర్‌, పరిశ్రమ శాఖ డైరెక్టర్‌, ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం ఇతర సభ్యులుగా ఉన్నారు.

 

 

ఇటీవల కరోనా కారణంగా చైనా నుంచి కొన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పిలుపు ఇచ్చారు. చైనా నుంచి వచ్చే కంపెనీలను గుర్తించి.. వాటికి రెడ్ కార్పట్ పరిచే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీకి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఇప్పటికే ఈ పని ప్రారంభించింది. ఇటీవలే కేటీఆర్ ఆన్ లైన్ ద్వారా ఓ పెట్టుబడుల సదస్సులో పాల్గొని తెలంగాణకు రావాలంటూ పారిశ్రామిక వేత్తలకు విజ్ఞప్తి చేశారు.

 

 

ఇక ఇప్పుడు ఏపీ కూడా ఈ బరిలో దిగుతోంది. మరి మంత్రి గౌతంరెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎంత వరకూ సఫలీకృతం అవుతారో చూడాలి. పొరుగున ఉన్న తెలంగాణను కాదని ఏపీకి పరిశ్రమలు వచ్చేలా గౌతంరెడ్డి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. కేటీఆర్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టి ఏపీకి పరిశ్రమలు రప్పిస్తారో చూడాలి. ఇది గౌతంరెడ్డి సమర్థతకు ఓ అగ్ని పరీక్ష అనే చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: