ఏపీలో హైకోర్టు జగన్ సర్కారు నిర్ణయాలను పదే పదే తప్పుబడుతోంది. అనేక కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. తాజాగా ఒక్కరోజే నాలుగైదు అంశాల్లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి. అందులోనూ వైద్యుడు సుధాకర్ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుని.. ఏకంగా కేసును సీబీఐకి అప్పగించింది.

 

 

డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని ఏకంగా సీబీఐకి అప్పగించడం ఒక విధగా జగన్ సర్కారుకు షాకుగానే చెప్పుకోవాలి. అసలు ఈ కేసు విషయంలో హైకోర్టు తీరు చాలా యాక్టివ్ గా ఉందనే చెప్పాలి. సాధారణంగా కోర్టులు జనం వేసే పిటీషన్లను విచారిస్తాయి. తమంతట తాము సుమోటోగా తీసుకునే కేసులు చాలా తక్కువ. అందులోనూ ఓ టీడీపీ మహిళానేత రాసిన లేఖ ఆధారంగా ఈ కేసు నమోదైంది.

 

 

ఈ కేసు ను ఏకంగా హైకోర్టు సీబీఐకి అప్పగించేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టు చూపించిన చొరవ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చాలా సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ తిరుగుతున్నాడని ఆక్షేపించారు. హైకోర్టును మేనేజ్‌ చేసుకుంటూ తిరుగుతున్నాడన్నారు. ఎంతసేపు మేనేజ్‌మెంట్లతోనే ఒడ్డుఎక్కే చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు.

 

 

సుధాకర్‌బాబును అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడన్నారు ఎంపీ నందిగం సురేష్. శాడిస్టులా బూతులు మాట్లాడుతూ, కార్ల కింద చొరబడుతూ ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి చంద్రబాబు సపోర్టు చేస్తున్నాడని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంగ్లిష్‌ మీడియం విద్య వంటి విషయాల్లోనూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను చూసి నవ్వాలో.. బాధపడాలో అర్థం కాని పరిస్థితి అని కామెంట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: