తెలంగాణ‌లో అంచ‌నాల‌కు అంద‌కుండా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. ఈ మ‌ధ్య పోలీసులు కూడా వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో పోలీస్‌శాఖ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. మొన్న‌టికి మొన్న ఓ కానిస్టేబుల్‌ ఈ మహమ్మారి బారిన ప‌డి మరణించిన మరుసటి రోజే ఇద్దరు పోలీసు అధికారులకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్, మరో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా వైర‌స్ సోకింది. దీంతో అధికారులు వారిద్దరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

అలాగే ఆయా స్టేషన్ల సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఇక‌ ఎస్‌ఐని కలిసిన ప్రజలు ఎవరైనా ఉన్నారేమో గుర్తించి వారిని క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించారు. అలాగే.. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రెండు నెలల ముందే తన కుటుంబ సభ్యులను సొంతూరు కోదాడకు పంపించేయడంతో వారికి వైరస్‌ ముప్పు తప్పిందని అధికార‌వ‌ర్గాలు అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఆందోళ‌న చెందుతున్నారు. వారి కుటుంబాలు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప‌రిస్థితులు రోజురోజుకూ మ‌రింత దారుణంగా మారుతుండ‌డంతో అధికారుల‌ను టెన్ష‌న్ పెడుతోంది.

 

ఇదిలా ఉండ‌గా... తెలంగాణ‌ రాష్ట్రంలో శుక్రవారం మరో 62 కరోనా కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు ఉండగా.. 19 మంది వలసదారులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,761కి చేరుకుంది.  కరోనాతో శుక్రవారం ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 48కి చేరింది. తాజాగా..  ఏడుగురు కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,043 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారు. వలసదారుల్లో కరోనా కేసులు  ఎక్కువ కావడంతో రూర‌ల్ ఏరియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 118 వలసదారులు ఉన్నట్లు అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ప‌రిణామాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: