రాజకీయ నాయకుల్లో కొందరికి ఓ పదవి రాగానే కళ్లు నెత్తికెక్కుతాయి. తాము గెలిచింది జనం ఓట్లతోనే అన్న సంగతి మరిచిపోయి.. తామేదో పై నుంచి దిగొచ్చామని ఫీలవుతుంటారు. ఇంకొందరు ఎలక్ట్రానికి యుగం అన్న సంగతి మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని ఝలక్ లు తగులుతున్నాయి.

 

 

కర్ణాటకలో అలాగే జరిగింది. మధు స్వామి అనే మంత్రి ఓ ప్రజాకార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఎందుకు కోపం వచ్చిందో ఏమో కానీ.. ఓ మహిళను ఏకంగా బూతులు తిట్టేశారు. ఆ బూతు పురాణాన్ని ఓ మహానుభావుడు సెల్ ఫోన్‌లో షూట్ చేశారు.. ఇంకే ముంది అది కాస్తా వైరల్ గా మారింది. మంత్రి గారి పరువు కాస్తా పోయింది. ఏంటిది మరీ దారుణంగా మహిళలపై నీ ప్రతాపం.. అంటూ నెటిజన్లు కూడా బండ బూతులు తిట్టడం మొదలు పెట్టారు.

 

 

ఇది కాస్తా సీఎం యడ్యూరప్ప దృష్టికి వెళ్లింది. పార్టీ పరువు పోయేలా ఉండటంతో ఆ మధుస్వామిని పిలిపించి ఆయన కూడా సీక్రెట్ గా బండ బూతులు తిట్టేసినట్టున్నారు. మరోసారి ఇలా జరిగితే ఉన్న మంత్రి పదవి కాస్తా ఊడుతుంది జాగ్రత్త అంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అంతే కాదు.. యడ్యూరప్పే ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు కూడా.

 

 

మంత్రి మధుస్వామి ఒక మహిళ పట్ల అసభ్యకర భాష వాడారని.. ఆ విషయం తనకు తెలిసిన తర్వాత పిలిచి మందలించానని యడ్యూరప్ప మీడియాకు చెప్పారు. మరోసారి ఇలా జరగడానికి వీలులేదని స్పష్టం చేశానని యడ్యూరప్ప అన్నారు. బాధిత మహిళను కూడా పిలిచి మాట్లాడతానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప వివరణ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆ మంత్రి మధుస్వామి కూడా ఈ ఘటనపై క్షమాపణ చెప్పారు. బూతులు తిట్టనేల.. ఆ పై క్షమాపణ చెప్పనేల.. ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: