క‌రోనా సృష్టించిన అనేకానేక స‌మ‌స్య‌లను ఇప్పుడు ప్ర‌జ‌లు ఓ రేంజ్‌లో అనుభ‌విస్తున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా అయితే, జ‌న‌జీవనం తీవ్రంగా స్తంభించింది. తాజాగా మార్గ‌ద‌ర్శ‌కాలు స‌డ‌లించ‌డంతో ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు ఊప‌రిపీల్చుకుంటున్నారు. అయితే, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకొని  కొంద‌రు వారిని దోచుకుంటున్నారు. అలా మోస‌పోబ‌డుతున్న వారిలో మ‌న‌మూ ఒక‌రం అనే సంగ‌తి తెలి‌సిందే. నిత్యావసర వస్తువుల ధరల రూపంలో ప్ర‌జ‌లను దోచుకుంటున్నారు. దీనిపై పౌర సరఫరాలశాఖ దృష్టి కేంద్రీకరించింది. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్తోంది.

 

 

అనేక మంది వ్యాపారులు ఎమ్మార్పీ ధ‌ర‌ల‌ను లైట్ తీసుకుంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సంగ‌తి తెలిసిందే. దీనిపై ఫిర్యాదులు చేసినా, అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నా కొంద‌రు తేలిక‌గా ఉంటున్నారు. ఎన్నిసార్లు వ్యాపారస్తులను హెచ్చరించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. వినియోగదారులకు అన్యాయం జరుగకుండా నగర వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అందుతుండటంతోపాటు ఇటీవల హైకోర్టు కూడా తీవ్రస్థాయిలో స్పందించడంతో కట్టడి చేసేందుకు వ్యూహాలు రచించింది.

 

 

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు అన్ని శాఖలకు చెందిన అధికారులతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్‌పీ ధరకు మించి వినియోగదారుడి నుంచి డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో పోలీసు నుంచి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, పౌరసరఫరాల శాఖకు చెందిన ఏసీఎస్‌వోతో బృందం పని చేస్తుంది. కిరాణా దుకాణాలు, సూపర్‌మార్కెట్లు, మెడికల్‌ షాపులు,ఇతర విక్రయ దుకాణాల మీద దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన దుకాణాలను సీజ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసి కొన్ని సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. అందులో మొదటి బృందం యాకుత్‌పురా అండ్‌ చార్మినార్‌ సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. రెండో బృందానికి నాంపల్లి, అంబర్‌పేట సర్కిళ్ల బాధ్యతలు, మూడవ బృందానికి మెహిదీపట్నం, ఖైరతాబాద్‌ సర్కిళ్ల బాధ్యతలు, నాలుగవ బృందానికి బేగంపేట, సికింద్రాబాద్‌ సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. ఇక‌నుంచి మీ ఫిర్యాదుల‌ను వీరి దృష్టికి తీసుకుపోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: