సుదీర్ఘ ఉత్కంఠ అనంత‌రం అయోధ్యలో రామ‌మందిర నిర్మాణానికి అంతా సెట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తికావడానికి మూడు నుంచి మూడున్నరేళ్ల‌ సమయం పడుతుందని నిర్మాణ‌ప‌నులు చేస్తున్న  శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయితే, మందిరం నిర్మాణానికి ముందే అయోధ్య వార్త‌ల్లో నిలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడుతున్న స్థలానికి సమీపంలో పలు హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది.

 

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంలో ఆలయ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. ట్రాక్టర్లు, జేసీబీలతో నేలను చదును చేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తుండగా గ‌తంలోని నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయ‌ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. వీటిలో ఐదు అడుగుల శివలింగం, నల్లగీటురాయి స్తంభాలు ఏడు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు ఆరు, కలశం, రాతి పుష్పాలు, ఇతర విగ్రహాలు ఉన్నట్లు పేర్కొంది. పూర్వం ఇక్కడ రామాలయం ఉండేదని వీటి ద్వారా మరింత స్పష్టమవుతున్నదని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు. 

 

కాగా, ఇటీవ‌ల శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరీజీ మహరాజ్ మాట్లాడుతూ, ఆలయం నిర్మాణం కోసం భక్తులు సమర్పించే విరాళాల్ని స్వీకరిస్తామని తెలిపారు. ‘అక్షర్‌ ధామ్‌ నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహాన్ని మూడేళ్ల‌లో నిర్మించారు. ఇదేవిధంగా మూడు నుంచి మూడున్నరేళ్ల‌ సమయంలో గొప్ప రామ మందిరాన్ని  నిర్మిస్తామని భావిస్తున్నాం’ అని తెలిపారు. మందిర నిర్మాణం కోసం భక్తులు ఇచ్చే విరాళాల్ని స్వీకరిస్తారా? అన్న ప్రశ్నకు గిరీజీ స్పందిస్తూ.. ‘మందిరం నిర్మాణం కోసం అప్పట్లో ఇటుకలను పంపిన భక్తులు.. ఇప్పుడు అదే మందిరం నిర్మాణం కోసం విరాళాలు పంపొచ్చు’ అని చెప్పారు. ప్రజాధనంతో, ప్రజల సహకారంతో ఆలయం నిర్మాణం జరుగుతుందన్నారు. అయితే, ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని ఆలయ నిర్మాణ కమిటీ.. ఆలయ నిర్మాణానికి పట్టే సమయంపై ఇచ్చే సూచనలను అనుసరించి ఆ తేదీ ఆధారపడి ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: