ఇండియాలో దాదాపు రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మొదట్లో చాలా కఠినంగా అమలైన లాక్ డౌన్ ఇప్పుడు కాస్త సులభతరంగా మారింది. కానీ ఈ లాక్ డౌన్‌తో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ అన్నీ సులభతరం చేస్తున్నారు. మరి ఈ లాక్ డౌన్ తో ఇండియా సాధించిందేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

 

 

ఈ ప్రశ్నలకు సమాధానం నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ అమలు ద్వారా దేశంలో కరోనా కేసులు, మరణాలను భారీ సంఖ్యలో తగ్గించామని ఆయన అంటున్నారు. లాక్‌డౌన్‌ లేకుంటే దేశంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉండేవో ఆయన చెబుతున్నారు. ఇండియాలో లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే.. కేసుల సంఖ్య 14 లక్షల నుంచి 29 లక్షల వరకూ ఉండేదట.

 

 

అంతే కాదు.. ఇండియాలో లాక్ డౌన్ పెట్టకపోతే... 37 వేల నుంచి 78 వేల మంది వరకూ చనిపోయి ఉండేవారట. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ శ్రీవాత్సవతో కలిసి వినోద్ పాల్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘మార్చి 25న విధించిన తొలి లాక్‌డౌన్‌ ఫలితాలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో 22.6 శాతానికి పెరిగిన కేసుల రోజువారీ వృద్ధి రేటు... మే 15 నాటికి 5.5 శాతానికి చేరింది. 71 శాతానికి వెళ్లిన రోజువారీ మరణాల వృద్ధిరేటు కూడా మే 15 కల్లా 5.5 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌కి ముందు 3.4 రోజులకే కేసులు రెట్టింపుకాగా... అందుకు ఇప్పుడు 13.3 రోజులు పడుతోందన్నారు.

 

 

లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ వ్యాప్తి కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని.. 90% కేసులు పది రాష్ట్రాలకు పరిమితమయ్యాయని ఆయన వివరించారు. 80% క్రియాశీల కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 60% పైగా కేసులు ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, ఠాణేల్లోనే ఉన్నాయి. పుణె, ఇండోర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లను కూడా కలిపితే 70% కేసులుంటాయి. 80% మరణాలు 5 రాష్ట్రాల్లో, 95% మరణాలు పది రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్నాయి. 60% మరణాలు కేవలం అయిదు నగరాలకే పరిమితమయ్యాయని వినోద్ పాల్ వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: