మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తుంది. ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా ప్ర‌పంచంపై దాడి చేసి.. నెల‌లు గ‌డుస్తున్నా దీని దూకుడు త‌గ్గ‌డం లేదు. ల‌క్ష‌ల మందిని పొట్ట‌న పెట్టుకున్నా క‌రోనా ఆక‌లి తీర‌డం లేదు. ఈ క్ర‌మంలోనే క‌రోనా కాటుకు ఎంద‌రో బ‌ల‌వ్వ‌డంతో.. వారి కుటుంబాలు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డాయి. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు సంఖ్య 50 ల‌క్ష‌ల మార్క్ కూడా దాటేసింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ప్ర‌పంచ‌దేశాల‌కు దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది.

 

అయితే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకు ఆయుర్వేద ఔషధం అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడికి క‌రోనా‌ను నిరోధించే శక్తి ఉన్నట్టు తేలింది. వాస్త‌వానికి  అశ్వగంధ ఆయుర్వేదం వైద్యం లో చాలా ముఖ్యమైనది . అందుకే దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని అంటారు. ఇంఫ్లమేషన్ ని తగ్గించడం నుంచి, ఒత్తిడి సమస్య వరకూ అశ్వగంధ ఎన్నో విధాలు మేలు చేస్తుంది. 

 

ఇండియా, నార్త్ ఆఫ్రికా లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఇటువంటి అశ్వ‌గంధ క‌రోనాకు అడ్డుక‌ట్ట వేస్తుందా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్ యాసిడ్ పెంథాల్ ఈస్ట్ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ఔషధాన్ని చికిత్సలో వాడి క‌రోనా మరణాలను తగ్గించొచ్చని పరిశోధకులు తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా అశ్వగంధకు ఇప్పటికే మంచి పేరుందని, దానికి వైరస్‌తో పోరాడే శక్తి కూడా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేర‌కు ఢిల్లీ ఐఐటీ బయోకెమికల్ అండ్ బయో టెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.సుందర్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: