ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లో తన వేగాన్ని పెంచింది. కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆ ఐదు రాష్ట్రాల్లోనే 80 శాతంకు పైగా కేసులు నమోదయ్యాయి. 

 

చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన చిన్న వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఐరోపా, అమెరికాలను వణికించిన కోవిడ్.. ప్రస్తుతం భారత్‌లో పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 19 వేలకు చేరువైంది. మూడున్నర వేల మంది కరోనాకు బలయ్యారు. ఇలా టెన్షన్ పెడుతున్న కరోనా ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది.

 

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ల్లో కరోనా విధ్వంసానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ ఐదు రాష్టాల్లోనే 80 శాతంకు పైగా కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో అయితే పరిస్థితి భయంకరంగా ఉంది.  మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాణాంతక వైరస్‌ ధాటికి దేశ ఆర్థిక రాజధాని చిగురుటాకులా వణుకుతోంది. ముంబై వాసులను కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 300 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో కేసులు వెలుగుచూడటం ఇది తొలిసారి. దీంతో మహారాష్ట్ర ఒక్కసారికి ఉలిక్కిపడింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 42 వేలకు చేరువైంది. 14 వందల 54 మంది వైరస్ కాటుకు బలయ్యారు. 

 

తమిళనాడులోనూ కరోనా టెన్షన్ ఆగడం లేదు. రాష్ట్రంలో కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయ్. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అత్యధిక కేసులు నమోదయ్యాయ్. కరోనా ట్యాలీలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ కేసుల సంఖ్య 14 వేలకు చేరువైంది. ఇక మూడో స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్‌లో 12 వేల 9 వందల మందికి వైరస్ సోకింది. అటు మరణాల్లో మాత్రం తమిళనాడు కన్నా గుజరాతే ముందుంది. ఇక్కడ 7 వందల 73 మంది వైరస్‌ సోకి చనిపోయారు. 

 

దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఢిల్లీలో కొత్తగా 660 మందికి వైరస్ సోకింది. ఢిల్లీలో ఇన్ని కేసులు నమోద్వడం ఇదే తొలిసారి. ఢిల్లీలో కేసుల సంఖ్య 12న్నర వేలకు చేరువైంది. ఇక రాజస్ధాన్‌లోనూ కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 6 వేలకు పైగానే ఉంది. ఇలా ఈ ఐదు రాష్ట్రాల్లోనే 86 వేల కేసులు నమోదయ్యాయ్. ఈ ఐదు రాష్ట్రాల పరిస్థితిపై కేంద్రం ఆందోళన చెందుతోంది. నాలుగో లాక్‌డౌన్‌తో భారీగా సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. రానున్న రెండు నెలల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది. మహమ్మారిని నిలువరించడానికి వ్యాక్సిన్ రాకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: