తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన సున్నిత‌మైన అంశాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన‌వ‌స‌ర‌మై నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా..?  ముందుముందు రాజ‌కీయంగా ఆయ‌న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌దా..?  ఏడుకొండ‌ల‌వాడి ఆస్తుల‌ను అమ్మ‌డం రాజ‌కీయంగా దుమారం రేప‌డం ఖాయ‌మేనా..? అంటే ప‌లువురు ప‌రిశీలకులు మాత్రం ఔన‌నే అంటున్నారు. ఇటీవ‌ల‌ టీటీడీ ఆస్తుల అమ్మాకాల కోసం ఏప్రిల్ 8నే జీవో జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డ్డాయి. ఈ రోజు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

 

తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. టీమ్‌ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి ఏకంగా బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. అయితే.. ఇక్క‌డ‌ టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరర్థ‌క‌మ‌ని టీటీడీ అనడం దారుణమని టీడీపీ నేతలు మండిప‌డుతున్నారు. ఆ స్థలాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతలు కూడా మండిపడ్డారు. న్యాయపోరాటం చేస్తామని ప్ర‌క‌టించారు. వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని అన్నారు. జరుగుతున్న దారుణాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకువెళతామని జనసేన నేతలు అంటున్నారు.

 

రాజ‌కీయంగా ఎలాంటి ఇబ్బందులు లేనిస‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ టీటీడీ లాంటి సున్నిత‌మైన విష‌యాల్లో త‌ల‌దూర్చితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఏకంగా దేవుడి ఆస్తుల‌ను అమ్మ‌కానికి పెడుతున్నార‌న్న అప‌వాదు రాజ‌కీయ జీవితంలో జ‌గ‌న్ మూట‌గ‌ట్టుకుంటాడ‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన వైసీపీ.. ఐదేళ్లు తిర‌గ‌కుండానే అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఉనికిలేని ప్ర‌తిప‌క్షాల‌కు జ‌గ‌న్‌ అన‌వ‌స‌రంగా అవ‌కాశం ఇస్తున్నార‌ని.. ఇది రాజ‌కీయంగా ఆయ‌న‌కు మంచిప‌రిణామం కాద‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: