ఏపీ ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను, మార్కెట్లను అమ్మేయడానికి వేలంపాటలు ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్ శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తమిళనాడులోని 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. టీటీడీ పాలక మండలిలోనే ఆస్తుల విక్రయం కోసం తీర్మానం జరిగిందని... దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.  
 
టీమ్‌ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారని... బహిరంగ వేలం ద్వారా ఆస్తులు విక్రయించనున్నారని... ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు ప్రభుత్వం కట్టబెట్టిందని సమాచారం. పాలక మండలి సమావేశం గురించి కమిటీలను నిర్ణయించిన తర్వాత సమాచారం బయటకు వచ్చింది. కొన్నిరోజుల క్రితమే ఈ వార్తలు వచ్చినా చాలామంది లాక్ డౌన్ వల్ల టీటీడీ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో ఆస్తులు అమ్మేస్తోందని భావించారు. 
 
కానీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండు రోజుల క్రితం స్పష్టత ఇచ్చారు. టీటీడీ పెద్దలు ఆస్తులు నిర్వహించలేకపోతున్నామని... అందువల్లే ఆస్తులు అమ్మేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వమే టీటీడీతో భూములు విక్రయిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సదావర్తి సత్రం భూములను టీడీపీ అమ్మాలని ప్రయత్నిస్తే వైసీపీ కోర్టు మెట్లెక్కి భూములు అమ్మకుండా చేసింది. 
 
అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ శ్రీవారి ఆస్తుల్నే అమ్మడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు రావడం గమనార్హం. శ్రీవారి ఆస్తుల అమ్మకంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐతే వైసీపీ నుంచి ఆస్తుల విక్రయం గురించి అధికారికంగా స్పందన రాలేదు. వైసీపీ స్పందిస్తే మాత్రమే ఆస్తుల విక్రయం గురించి అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: