కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ‌ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా నుంచి అనేక దేశాలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో అనేక దేశాల కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. భార‌త్‌తో స‌త్సంబంధాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా భారత్ లో పెట్టుబడులు పెడితే ఎంతో సురక్షితమ‌ని, వ్యాపారం కూడా లాభదాయకంగా జరుగుతుందని ఆయా కంపెనీలు అనుకుంటున్నాయి.

 

ఇందులో భాగంగానే చైనా నుంచి జర్మనీకి చెందిన ప్ర‌ముఖ షూల‌ తయారీ కంపెనీ భారత్‌కు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఆస్ట్రేలియా కూడా భారతదేశంతో వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా ముందుకు వస్తోంది. భారత్‌లో రక్షణ రంగ సామాగ్రి ఉత్ప‌త్తి ఎంతో తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా కూడా తమకు అవసరమైన రక్షణ రంగ సామగ్రిని భారత్‌లో తయారు చేయించుకునేందుకు రెడీ అవుతోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే రక్షణ రంగ సామగ్రి ఉత్పత్తికి భార‌త్‌లో చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

 

అలాగే శాటిలైట్ లాంచింగ్ కు సంబంధించి కూడా భారత్ ఎంతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు నేడు భార‌త్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో భారతదేశం కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే దేశంలోని అనేక రాష్ట్రాలు విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు అనుగుణంగా సంస్కరణలు కూడా చేప‌డుతున్నాయి. విదేశీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత వేగంగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ చర్యలు తప్పనిసరి అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: