తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తుపాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా.. ఉక్కపోత కూడా మొదలైంది. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు ఇప్పుడిప్పుడే బయటికి వచ్చినా.. వేడి తాపానికి బెంబేలెత్తిపోతున్నారు.  

 

తెలుగు రాష్ట్రాలపై ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోహిణీకార్తె రాకముందే రోళ్లు పగిలిపోయేంత సెగలు కక్కుతున్నాడు. వడగాల్పులు, వెచ్చటి గాలులతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారింది. తెలంగాణ కంటే ఏపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పడమర, వాయువ్య దిశల నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా ప్రాంతం ఉడికిపోతోంది. ఉమ్‌పన్ తుఫాను బలహీనపడటంతో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

 

విదర్బ, తెలంగాణలో కొనసాగిన వడగాల్పుల ప్రభావం కోస్తా వరకు విస్తరించింది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కురించేడులో 47.97, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు. పగటి టెంపరేచర్‌ పెరగడమే కాకుండా రాత్రి సమయంలోను వడగాలుల తీవ్రవ పెరుగుతుందని చెప్తున్నారు.

 

విశాఖ నగరవాసులను సూరీడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. సూరీడు నడినెత్తికొచ్చే సమయానికి కళ్లు బైర్లు కమ్మేలా ఎండ తీవ్రత అందరినీ బెంబేలెత్తిస్తోంది. గత మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. ఉంపన్ తుఫాన్ కారణంగా ఉక్కపోత మరింతగా పెరిగిపోయింది. దీంతో శీతలపానీయాలు సేవించి ఉపశమనం పొందుతున్నారు స్థానికులు.

 

ఇటు తెలంగాణలోను భానుడు భగభగ మండిపోతున్నాడు. లాక్‌డౌన్‌ సడలింపులతో బయటకు వచ్చిన జనం ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్‌లో మళ్లీ వాహన కాలుష్య పెరగడంతో ఉక్కబోత అధికమయింది. వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. మరో మూడు రోజులు భానుడు తెలంగాణపై సెగలు కక్కుతాడని నిపుణులు చెప్తున్నారు. ప్రజలు వడగాలుల బారిన పడకుండా, డీహైడ్రేట్‌ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, నీడలో ఉండాలని చెబుతున్నారు.

 

43 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నా.. మిగిలిన ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి. రోహిణీ కార్తె మరో రెండు రోజుల్లో రానున్న కారణంగా ఎండల త్రీవత మరింత పెరుగుతుందని జనం ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: