జగన్ ప్రభుత్వం వరుస సంచలన నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నవరత్నాల అమలు కోసమని చెప్పి...నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములని అభివృద్ధి చేసి, వాటిని వేలం వేసి వచ్చిన సొమ్ముని పథకాలు అమలుకు ఉపయోగించాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ నేతృత్వంలోనే టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.  తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమైంది.

 

ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేసి, ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. అయితే ఈ నిర్ణయం తీసుకుని జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు మరో అవకాశం ఇచ్చినట్లు కనబడుతోంది.  శ్రీవారు భూములని వేలం వేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

 

వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ,బీజేపీ, జనసేనలు విమర్శిస్తున్నాయి. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని, జరుగుతున్న దారుణాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకువెళతామని అంటున్నారు. ముఖ్యంగా హిందువులు అనుకూల పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ నేతలైతే జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎట్టి పరిస్థితీల్లోనూ, శ్రీవారి భూములు వేలం జరగనివ్వమని అంటున్నారు. దేవాలయ ఆస్తులు వేలం వేయడానికి వీలు లేదని, కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నాయని టీజీ వెంకటేష్ లాంటి వారు అంటున్నారు. అది జరిగితే మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెబుతున్నారు.

 

శ్రీవారి ఆస్తులు చౌకగా వైసీపీ నాయకులు కొట్టేయడానికే ఈ అమ్మకం నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. 23 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మాల్సిన అవసరం టీటీడీకి ఎందుకొచ్చిందని మండిపడుతున్నారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న భూములని అమ్మితే తప్పేంటి అన్నట్లుగా వైసీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆదాయం వస్తుంది కదా, అది పేద ప్రజలకు ఉపయోగపడుతుందని, శ్రీవారి భూములు వేలం వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. మరి చూడాలి ఈ భూముల రగడ ఎంతవరకు వెళుతుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: