ప్ర‌పంచ‌వ్యాప్తంగా మెజార్టీ దేశాలు క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిక‌ర్తగా చైనాను నిందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొవిడ్‌-19 వైరస్‌తో చైనా పేరు మారుమోగిపోయింది. ఈ ప్ర‌భావం ఆ దేశం యొక్క పెట్టుబ‌డుల‌పై ప‌డుతోంది. కరోనా దెబ్బకి చైనాలో స్టార్ట్‌ చేసిన అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ భారత్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మన్ ఫుట్‌‌వేర్ బ్రాండ్ వోన్ వెల్‌‌ఎక్స్‌‌ ఓనర్ కాస ఎవర్జ్‌‌ తన బూట్ల తయారీని చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భార‌త్‌కు వ‌స్తున్న రెండో ప్ర‌ముఖ బ్రాండ్‌గా నిలిచింది. 

 

వోన్ వెల్‌‌ఎక్స్‌‌ ఓనర్ కాస ఎవర్జ్  దాదాపు 80 దేశాల్లో అమ్మకాలు జరుపుతోంది. చైనాలో ఉత్ప‌త్తిని ఉప‌సంహ‌రించుకొని భారత్‌లోని ఆగ్రాలో రూ. 110 కోట్ల పెట్టుబడితో మొదలుపెట్టనుంది. దీని ద్వారా ఏడాదికి 30 లక్షల జతల బూట్లు తయారు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇది ఒకటే కాకుండా లైసెన్సీ లాట్రిక్‌ ఇండస్ట్రీస్‌ ఫ్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీతో కలిసి తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప‌రిణామం చైనాకు షాక్ వంటిద‌ని నిపుణులు చెప్తున్నారు.

 

ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే, భారతీయ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ చైనాకు గుడ్‌బై చెప్పింది. చైనాలోని తమ కార్యకలాపాలను భారత్‌కు మార్చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఐదేళ్ల‌లో ఇండియా రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విధాన నిర్ణయాలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఆ సంస్థ సీఎండీ హరి ఓం రాయ్‌ తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు బాగున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఇకపై భారత్‌లోనే మొబైల్‌ ఫోన్ల అభివృద్ధి, తయారీ ఉంటుందని స్పష్టం చేశారు. ‘చైనాలో మా మొబైల్స్‌ డిజైన్‌ కోసం దాదాపు 600-650 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు ఈ డిజైనింగ్‌ను భారత్‌కే తరలిస్తున్నాం. మార్కెట్‌లో మా డిమాండ్‌కు తగ్గట్లుగా ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తాం’ అన్నారు. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచే మా మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు సాగాయని, ఇకపై భారత్‌ నుంచి ఎగుమతులు చేస్తామన్నారు. చైనాకు మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేయాలన్నదే తమ ఆశయమని పేర్కొన్న రాయ్‌.. ఇప్పటికే భారత్‌ నుంచి అక్కడికి మొబైల్‌ చార్జర్లు ఎగుమతి అవుతున్న విషయాన్ని గుర్తుచేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: