క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో విధించిన లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు స‌డ‌లించ‌డంతో జ‌న‌జీవనం సాధార‌ణ స్థితికి చేరుకుంది. ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాలు తెరుచుకుంటున్నాయి. కాగా, ఇన్నాళ్లు విధుల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ సౌక‌ర్యం పొందిన వారిలో ప్ర‌ధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల సంఖ్య ఎక్కువ‌. మ‌న హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని తాజా స‌డ‌లింపుల‌తో సుమారు రెండు నెలల తరువాత ఐటీకారిడార్‌ ఉద్యోగులతో సందడిగా మారింది. అయితే, వ‌ర్క్ ఫ్రం హోం విష‌యంలో నూత‌న ప్ర‌తిపాద‌న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

 

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అనేక ఐటీ పరిశ్రమలు వర్క్‌ ఫ్రం హోంకు శ్రీకారం చుట్టాయి. ఇటీవల సడలింపు ఇవ్వడంతో 30శాతం ఐటీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వైద్యుల సూచనలు అమలు చేస్తున్నాయి. 33 శాతం వర్క్‌ఫోర్స్‌తో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం అనుమతించడంతో ఆ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు షురూ చేశాయి. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉద్యోగులకు పలు షరతులు విధించారు. ప్ర‌తి ఉద్యోగిని పరీక్షించాకే పనిలోకి తీసుకుంటున్నారు. గర్భిణులు, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు వర్క్‌ ఫ్రం హోం అమలు చేశారు. 

 


గచ్చిబౌలీ, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, ఐటీ కారిడార్‌ తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలు ఎంప్లాయీస్‌తో సందడిగా మారాయి. అనవసరంగా భయాందోళనలు చెందకుండా ఐటీ కంపెనీలకు స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసిడ్యూర్‌(ఎస్‌ఓపీ)ను ఇండస్ట్రీ బాడీలు, పోలీసులు జారీ చేశారు. ఉద్యోగుల పికప్‌ అండ్‌ డ్రాపింగ్‌ మొదలుకుని టెంపరేచర్‌ టెస్ట్‌ల వరకు జాగ్రత్తలను సూచించారు. అనవసర వదంతులను నమ్మి అలజడి చెందవద్దని, నోడల్‌ అధికారి అనుమతి లేకుండా కరోనాకు సంబంధించి కంపెనీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని అందులో సూచించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఐటీ కారిడార్‌లో సుమారు 30శాతం కంపెనీలు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంకే ప్రాధాన్యతనిస్తూ.. సెప్టెంబర్‌ వరకు పొడిగించాయి. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగుల ఆరోగ్యానికి కంపెనీలు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూనే అనేక చాలెంజ్‌లను ఎదుర్కొనవలసి ఉంటుందని పలువురు ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: