ఆఫ్ఘ‌నిస్తాన్‌..నిత్యం బాంబుల‌తో మోత‌తో ద‌ద్ద‌రిల్లే దేశం. ఇప్పుడు ఆ దేశం క‌రోనా మ‌హ‌మ్మారి రూపంలో మ‌రో ముప్పును ఎదుర్కోంటోంది. ఇక్క‌డ ప‌రిస్థితులు ఎంత ద‌య‌నీయంగా ఉన్నాయో ఈ విష‌యం చూస్తే అర్థ‌మ‌వుతుంది. మూడున్నర కోట్ల జనాభాకు 400 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో తమ దేశ పౌరుల ప్రాణాలు కాపాడుకోవటం కోసం యువ‌తులు న‌డుం బిగించారు. *ఆఫ్ఘ‌న్ డ్రీమ‌ర్స్‌* పేరుతో రంగంలోకి దిగారు. సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్న ఈ యువకెరటాలు  రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల విలువైన వెంటిలేటర్లను రూ.45 వేలలోపు  ధరకే అందిస్తామని ప్రకటించారు. కారు మోటర్‌, బైక్‌ చైన్‌ డ్రైవ్‌తో వీటిని తయారు చేస్తూ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తున్నారు. ఈ బృందంలోని అమ్మాయిలంతా 14 నుంచి 17 ఏళ్ల లోపువారే కావ‌డం గ‌మ‌నార్హం.

 

 టయోటా  కారులోని మోటార్‌ను, హోండా మోటార్‌ సైకిల్‌లోని చైన్‌ డ్రైవ్‌ను ఉపయోగించి ఓ వెంటిలేటర్‌ నమూనాను తయారు చేశారు. ఇది శ్వాసకోశ రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తుందట‌. అయితే..  కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. దీంతో నగరంలోని అన్ని దుకాణాలూ మూసి వేయడంతో,  ఈ వెంటిలేటర్‌కు కావల్సిన విడిభాగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు ఈ అమ్మాయిలు. అయినా ప‌ట్టుద‌ల‌తో దాదాపు 70శాతం పనిని పూర్తి చేశారు. త్వరలో ఆ వెంటిలేటర్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారట ఈ అఫ్గాన్‌ డ్రీమర్స్‌.

 

ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖకూడా వీరికి చేయూతను అందిస్తున్నది. ఈ నెలాఖరుకు వెంటిలేటర్లను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీరిపై దేశంలోకాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌ను కాపాడేందుకు భార‌త్ కూడా సాయం అందించింది. క‌రోనా రోగుల‌కు చికిత్స అందించేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసెట‌మాల్ మాత్ర‌ల‌ను అందించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: