క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో విమాన ప్ర‌యాణాల గురించి ప్ర‌జ‌లు ఆలోచించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. సోమవారం నుంచి దేశీయ విమాన రాకపోకలు దశలవారీగా పునఃప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. విదేశాల‌కు వెళ్తున్న వారికి ఇదే స‌మ‌యంలో తీపి క‌బురు వినిపించింది. విమాన ప్ర‌యాణాల నేపథ్యంలో ప్రయాణ నిబంధనలపై ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి   ప్రజలతో మాట్లాడారు. దేశంలో కరోనా పరిస్థితి అదుపులోకి వస్తే, జూన్‌ మధ్య నుంచి లేదా జూలై చివరినాటికే అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

 

ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన రాకపోకలను ఫునఃప్రారంభించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి వెల్లడించారు. గణనీయ సంఖ్యలో అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ‘ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు ఎందుకు ఆగాలి? పరిస్థితులు మెరుగుపడితే, కరోనాతో కలిసి మనం జీవించగలిగితే, విమాన రాకపోకలకు ఏర్పాట్లు చేయగలిగే స్థితిలో మనం ఉంటాం. జూన్‌ మధ్య నుంచి లేదా జూలై చివరినాటికి ఎందుకు ప్రారంభించకూడదు?’ అని ఆయన ప్రశ్నించారు. 

 


విమానంలో ప్ర‌యాణించే వారు ఆరోగ్య సేతు యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమమని, అయితే విమాన ప్రయాణాలకు ఆ యాప్‌ తప్పనిసరి కాదని స్పష్టంచేశారు. ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందని చెప్పారు. విమాన ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాలని పలు రాష్ర్టాలు నిర్ణయించడాన్ని హర్దీప్‌సింగ్‌పురి ఆక్షేపించారు. ‘ఆరోగ్య సేతు’ యాప్‌లో ‘గ్రీన్‌' స్టేటస్‌ కలిగి ఉన్న ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. ‘కరోనా పరీక్ష చేయించుకుని, ఫలితం నెగెటివ్‌ వచ్చి, ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేకపోతే, క్వారంటైన్‌ అవసరం లేదని నేను భావిస్తున్నా. ఆరోగ్య సేతు యాప్‌ పాస్‌పోర్ట్‌లాంటిది. అందులో గ్రీన్‌ స్టేటస్‌ ఉంటే, ఎవరినైనా ఎందుకు క్వారంటైన్‌లో ఉంచాలి?’ అని ప్రశ్నించారు. ఆరోగ్యంగా ఉన్న వృద్ధులను విమాన ప్రయాణాలకు అనుమతిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: