రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి మూడు లాంతర్ల కట్టడం గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు ఈ కట్టడాన్ని అధికారులు తొలగించడంపై విమర్శలు చేస్తున్నారు. మూడు లాంతర్లు చారిత్రాత్మ‌క క‌ట్ట‌డ‌మ‌ని నిరూపిస్తే త‌న‌ ప‌దవికి రాజీనామా చేస్తాన‌ని వైసీపీ ఎమ్మెల్యే కోలగ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి చెప్పారు. ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ఈ క‌ట్ట‌డం న‌మోదైంద‌ని నిరూపిస్తారా? అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 
 
నిన్న శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్ల కట్టడాన్ని అధికారులు తొలగించారు. అధికారులు ఆ ప్రదేశంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే వీరభ‌ద్ర స్వామి ఆదివారం ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు మూడు లాంతర్ల ఆధునీకరణ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. 
 
అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగ్లాకే ప‌రిమిత‌మ‌య్యార‌ని.... ఉనికి కోసం మూడు లాంతర్ల కట్టడం విషయంలో రోడ్డెక్కుతున్నారని చెప్పారు. మోతి మ‌హాల్‌, పూల్ బాగ్ ప్యాలెస్‌ లాంటి పురాతన కట్టడాలను నేలమట్టం చేసిన సమయంలో అవి పురాతన కట్టడాలు అని గుర్తు రాలేదా...? అని ప్రశ్నించారు. మూడు లాంత‌ర్లు చారిత్రాక క‌ట్ట‌డ‌మంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఘాటు విమర్శలు చేశారు. 
 
రాత్రిపూట ప్ర‌జ‌ల‌కు దారి చూపేందుకు మాత్ర‌మే మూడు లాంత‌ర్లు ఏర్పాటు చేశార‌ని ఆయన చెప్పారు. నిన్న మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు కూడా మూడు లాంతర్ల స్తంభం వివాదం గురించి స్పందించారు. పనులు పూర్తయిన తరువాత మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారని సంచయిత వెల్లడించారు. ఒక గదిలో మూడు లాంతర్ల స్తంభాన్ని భద్రపరిచామని మీడియాకు ఆమె చెప్పారు. మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారో లేక అక్కడ కొత్త కట్టడం వస్తుందో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: