హాంకాంగ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో ఏడాది నుంచి  ప్రదర్శనలు జరుగుతున్నాయి. హాంకాంగ్‌లో వందల సంఖ్యలో విదేశీ కంపెనీలు ఉన్నాయి. చైనా తన ప్రయత్నాలు విరమించుకోవాలని అమెరికా కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వెనకడుగు వేస్తుందా?..

 

ఆసియాలో అతి పెద్ద ఫైనాన్షియల్ హబ్‌ హాంకాంగ్ భవిష్యత్ రోజు రోజుకీ అయోమయంగా మారుతోంది. హాంకాంగ్‌పై పట్టు బిగించేందుకు చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హాంకాంగ్‌లో నేరస్తుల్ని చైనాకు అప్పగించే చట్టానికి వ్యతిరేకంగా.. ఏడాది నుంచి భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం వెనుక చైనా ప్రమేయం ఉందనే ఆందోళనకారుల ఆరోపణ. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. చట్టాన్ని తొలగిస్తామని బీజింగ్ నాయకత్వం చెబుతోంది. చట్టాన్ని రద్దు చేసిన తర్వాత హాంకాంగ్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణ అంతా చైనా పోలీసులే చూస్తారన్న ప్రకటన హాంకాంగ్ ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.

 

చైనా ప్రకటనతో హాంకాంగ్‌లో విదేశీ సంస్థలు వణికిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ హాంకాంగ్ స్టాక్ మార్కెట్ల మీద పడింది. శుక్రవారం ఒక్క రోజే హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు 5 శాతం కూలిపోయాయి. జులై 2015 తర్వాత మార్కెట్లు ఇంత భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. హాంకాంగ్‌ మీద ఇటీవల చైనా పెత్తనం పెరుగుతోంది. హాంకాంగ్‌లో ప్రజలు ఏం తినాలి, ఏం తాగాలనేది బీజింగ్ నుంచే ఆదేశాలు జారీ అవుతున్నాయి. స్వేచ్చా వాణిజ్యానికి, సమర్థ పాలనకు, సమాచార స్వేచ్చకు హాంకాంగ్ కేంద్రంగా ఉందని.. చైనా పెత్తనం మొదలైతే హాంకాంగ్ భవిష్యత్ ప్రమాదంలో పడటమే కాకుండా.. అసలు భవిష్యత్తే లేకుండా పోతుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

1842 తర్వాత హాంకాంగ్ క్వింగ్‌ వంశస్థుల చేతుల్లో నుంచి బ్రిటిషర్ల పాలనలోకి వచ్చింది. 1997 వరకూ హాంకాంగ్ బ్రిటిషర్ల కిందనే ఉన్నా.. స్వతంత్రంగా ఎదుగుతూ వచ్చింది. 1997 తర్వాత ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బ్రిటన్. ఒక దేశం రెండు ప్రభుత్వాలు అనే నినాదంతో హాంకాంగ్ తమదేనని చెప్పుకుంటోంది బీజింగ్ నాయకత్వం. హాంకాంగ్‌లో స్వేచ్చాయుత పరిస్థితులు, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండటంతో విదేశీ సంస్థలు ఇక్కడ తమ సంస్థల్ని స్థాపించాయి. దీంతో అది ఆసియా ఫైనాన్షియల్ హబ్‌గా మారింది. ఇప్పుడు చైనా ఇక్కడ పట్టు బిగిస్తూ ఉండటంతో ఈ సంస్థల భవిష్యత్ కూడా అయోమయంలో పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: