తెలంగాణ రాష్ట్రంలో నూత‌న పంట విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్రియాశీలంగా కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు, రైతులు, రైతు సంఘాల నాయ‌కుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల‌ను చైత‌న్యం చేయాల‌నే బాధ్య‌త‌ను మంత్రులు, ఎమ్ఎమ‌ల్యేల‌కు కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అప్ప‌గించారు. అయితే, ఈ బాధ్య‌త‌ను అందుకున్న ఓ మంత్రి తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు నేప‌థ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 

హన్మకొండలోని అంబెడ్కర్ భవన్ లో వాన కాలం-2020 పంటసాగు ప్రణాళికలపై అవగాహన సదస్సులో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతాంగానికి మేలు చేసే అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పేర్కొన్నారు. ``గతంలో రైతులకు గిట్టుబాటు ధరలకోసం, కరెంట్ కోసం, ఎరువులు, విత్తనాల కోసం అనేక సార్లు నాతో పాటుగా, అనేకమంది నేతలు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేశాం. కానీ నేడు వద్దన్నా నీళ్లు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నది, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తూ పండిన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది`అని మంత్రి వెల్ల‌డించారు.

 

కరోనా కష్ట సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా రూ. 7వేల కోట్లు రైతుబంధు కోసం.. రూ. 1200 కోట్లను 25 వేల రుణమాఫీ కోసం కేటాయించిన మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు కొనియాడారు. కేంద్రం ఏమాత్రం సహకరించకున్నా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, మార్కెట్ ధరకు రైతులు పండించిన పంటల కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను రైతులు ఉరికిచ్చి కొట్టాలె అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: