క‌రోనాను ప్ర‌పంచానికి అంటించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న చైనా...త‌న పొగ‌రును మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. సంద‌ర్భం ఏమాత్రం దొరికినా...గొప్ప దేశం అనే క‌టింగ్ ఇస్తోంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి  వాంగ్ యీ ఇదే రీతిలో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ సృష్టిక‌ర్త చైనా అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌హా ఆ దేశం ప‌దే ప‌దే ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా చైనా విదేశాంగ మంత్రి  వాంగ్ యీ స్పందిస్తూ, అగ్ర‌రాజ్యం అమెరికాను ఉద్దేశించి ఆ దేశం పేరును ప్ర‌స్తావించ‌కుండానే ఘాటు హెచ్చ‌రిక‌లు చేశారు. కొన్ని దేశాలు త‌మ‌పై నిందలు వేయడం ద్వారా తమ ప్రతిష్ఠను దిగజార్చుకుంటున్నాయని చైనా విదేశాంగ మంత్రి  వాంగ్ యీ వ్యాఖ్యానించారు. 

 

కరోనాకు సంబంధించి చైనాపై అంతర్జాతీయంగా ఎవరైనా కేసులు పెట్టినా అవి సాగే అవకాశం లేదని వాంగ్ ధీమా వ్య‌క్తం చేశారు. 'ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైర‌స్ కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న‌ది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కష్టాల్లో ఉన్న దేశాలకు సాయం చేయాల్సిందిపోయి అహంకారం ప్రదర్శించడం ప‌ద్ధ‌తి కాదు. మీ తప్పులను ఇతర దేశాలపైకి నెట్టి వేయ‌డం సమంజసం కాదు అని వాంగ్ సూచించారు. ఆలోచ‌నార‌హితంగా త‌మ‌పై నింద‌లు వేసి ప్ర‌పంచం ముందు చుల‌క‌న కావొద్ద‌ని వాంగ్ యీ హిత‌వు ప‌లికారు.

 

కాగా, కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 33 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఎక్కువగా ఈ ప్రాణాంతక వైరస్‌ మొదటిసారిగా బయటపడ్డ వుహాన్‌లోనే ఉన్నాయి. వైరస్‌ రెండో దశలో భాగంగా వుహాన్‌ పట్టణంలో ఇప్పటివరకు 11 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని చైనా హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. గ‌త‌ బుధవారం ఒక్కరోజే దేశంలో కరోనా లక్షణాలున్న 861 మందిని పరీక్షించింది. ఇందులో వుహాన్‌కు 281 మంది సంబంధించిన వారేకావడం గమనార్హం. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా వైరస్‌తో 4634 మంది చనిపోగా, 82,967 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: