యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో సఫలీకృతం అవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు అందరి చూపు లండన్ ఆక్సఫర్డ్ వర్సిటీపైనే ఉంది. అస్ట్రాజెనెకా అనే మందుల కంపెనీతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందిస్తున్న "ChAdOx1 nCoV-19 "అనే కరోనా వ్యాక్సిన్ కోతులపై మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే, తాజాగా ఈ విష‌యంలో ఓ షాక్ ఎదురైంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ రేసులో ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ విజయవంతమయ్యే అవకాశాలు 50 శాతం మాత్రమేనని పరిశోధనల్లో పాలుపంచుకుంటున్నశాస్త్రవేత్త అడ్రియన్‌ హిల్‌ తెలిపారు.

 

తాజా ప‌రిశోధ‌న‌ల‌పై అడ్రియన్‌ హిల్ స్పందిస్తూ, బ్రిటన్‌లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం కార‌ణంగా ఫ‌లితాల విష‌యాల్లో తేడా ఉంటుంద‌ని అన్నారు. సమూహంలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటంవల్ల పదివేల మంది వలంటీర్లపై చేసే వ్యాక్సిన్‌ పరీక్షల్లో ఫలితం కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. దీంతో 50 శాతం ఫలితాలు సరిగ్గా రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

 

కాగా, ఇటీవ‌ల అడ్రియ‌న్ మీడియ‌తో మాట్లాడుతూ జూలై, ఆగస్టు నాటికల్లా మనుషులపై ట్రయిల్స్ చేస్తామని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్  అతి తక్కువ ధర ఉంటుందని అన్నారు. అతి తక్కువ ధరకు అత్యధిక మందికి అందజేయడమే తమ లక్ష్యమని  అడ్రియన్‌ హిల్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా వివిధ దేశాల్లోని సుమారు ఏడు ఇనిస్టిట్యూట్‌లలో దీన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇక ఈ జాబితాలో భారత్‌లోని పూణే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఉందని అడ్రియన్‌ హిల్ పేర్కొన్నారు. కాగా, తాజా ప‌రిశోధ‌న ఫ‌లితాలు, ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్రవేత్త చేసిన వ్యాఖ్య‌లు క‌రోనా వ్యాక్సిన్‌పై ఆశ‌లు పెట్టుకున్న అనేక‌మందిని నిరాశ‌కు గురి చేసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: