వరంగల్ వలస కార్మికుల హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసులకే సవాల్ విసిరిన ఈ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. నిందితులు పోలీసుల విచారణలో హత్య చేసింది తామేనని అంగీకరించారు. బుస్రా ప్రియుడు సంజయ్ కుమార్ యాదవ్ తన స్నేహితులతో కలిసి సామూహిక హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. మొదట నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక 9 మందిని గోనెసంచిలో కట్టి బావిలో పడేశారు. 
 
మక్సూద్ కూతురు బుస్రాకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. పాప పుట్టిన తరువాత భర్తతో విభేదాలు రావడంతో ఆమె సొంతూరుకొచ్చింది. భర్తతో విడిపోయిన తరువాత బుస్రాకు సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అనంతరం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వివాహేతర సంబంధం వల్ల బుస్రాకు ఆమె తల్లికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 
 
మక్సూద్ ఇంటి పైన ఉండే బీహార్ కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం తరచూ తల్లీకూతుళ్ల గొడవలో జోక్యం చేసుకునేవారు. వీరు బుస్రాపై కన్నేసి ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన సంజయ్ కుమార్ పథకం ప్రకారం తొమ్మిది మందికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేశాడు. మక్సూద్ బెంగాల్ నుంచి 20 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్ కు వలస వచ్చాడు. 
 
నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో మక్సూద్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉండేవాడు. 2019 డిసెంబర్ నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో మక్సూద్ పని చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల మక్సూద్ కు రాకపోకలకు ఇబ్బంది అయింది. దీంతో గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గోదాం పక్కనే ఉన్న భవనంలో బీహార్ యువకులు నివాసం ఉండేవారు. బుస్రాతో యువకులు సన్నిహితంగా మెలగడంతో సంజయ్ 9 మందిని హత్య చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: