అడ్డంగా దొరికేయడం అంటే వైసీపీ నేతలకు ఎంత ఇష్టమో మరి. ఏపీలో అధికారాన్ని జగన్ కన్నా పార్టీ  నేతలు ఎక్కువగా అనుభవిస్తున్నారు. కానీ జనం అధికారం ఇచ్చింది జగన్ని చూసి, ఆయన కష్టాన్ని చూసి, ఆయన కమిట్మెంట్ చూసి. జగన్ మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకునిపోతున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారు. పదవుల్లో ఉన్న వారు కాస్తా బాధ్యతగా వ్యవహరించలేకపోతున్నారు.

 

ఫలితంగా విపక్షాలకు చాలా ఈజీగా దొరికేస్తున్నారు. తాజాగా టీటీడీ వ్యవహారమే తీసుకుంటే కరోనా మహమ్మారిని ముందు పెట్టుకుని హడావుడిగా శ్రీవారి భూములు అమ్మడం అవసరమా. దీని వల్ల ఒరిగేదేంటి. చాలా తక్కువ మొత్తం అంటే కోటిన్నర మాత్రమే ఆదాయం వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఆ భూములు అమ్మకం చేయడానికి టీటీడీ ఇపుడు తయారు కావడంతో విపక్షం రొట్టె విరిగి నేతిలో పడింది.

 

అంతే దేవుడు భూములు అమ్మేస్తున్నారంటూ రచ్చ చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ జనసేనా అన్నీ ఒక్కసారిగా అపర హిందూత్వ అవతారం ఎత్తేశాయి. జగన్ని ఆడిపోసుకుంటునాయి. నిజానికి ఈ భూముల అమ్మకాలు మొదలుపెట్టిందే బాబు సర్కార్. ఇక బాబు ఆనాడు నియమించిన చదలవాడ క్రిష్ణ మూర్తి టీటీడీ చైర్మన్ అయ్యాకనే నిరర్ధక భూములపైన నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం ఇక సబ్ కమిటీని కూడా వేశారు. ఆ కమిటీలో బీజేపీ, టీడీపీ సహా అన్ని ఉన్నాయి.

 

ఎక్కడో దూరాన తమిళనాడులో ఉన్న భూములు, ఇళ్ళూ వాటికి  కాపలా కాయడానికే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి వాటి బదులు ఆ భూములు అమ్మేసి ఆ సొమ్ము తెచ్చి శ్రీవారి ఖాతాలో వేయాలని నిర్ణయించారు. ఇక దేశంలో చాలా చోట్ల ఉన్న శ్రీవారి భూములు నాడు అమ్మారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెబుతున్నారు. సరే అవన్నీ నిజమే అనుకున్నా ఇపుడు జగన్ మీద ఊరకనే లేనిపోని దానికి  కస్సుబుస్సులాడుతున్న విపక్షం చాన్స్ కోసం ఎదురుచూస్తోంది.

 

అటువంటి వేళ వారికి అస్త్రం అందించడం నిజంగా తప్పే. ఇప్పటికైనా టీటీడీ బోర్డ్ నిర్ణయం రద్దు చేస్తేనే టీటీడీ పరువుతో పాటు జగన్ సర్కార్ పరువు నిలబడుతుంది. లేకపోతే కోర్టులకు వెళ్తారు, అక్కడ కూడా  మొట్టికాయలు పడతాయి, మరింత తలవంపులు వస్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: