జగన్ అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే జగన్ అన్నట్టుగా ఏడాది పాలన సాగిందా? అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా?  ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 80 శాతం  అమల్లో పెట్టి మాట నిలబెట్టుకున్నారని ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగానే జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించబోతోంది.


ఎన్నికల సమయంలోనే కాదు... ప్రతీ సందర్భంలోనూ కుల వృత్తుల అంశం ప్రస్తావనకు వస్తుంది. అయితే హామీలు అమలైనది మాత్రం చాలా తక్కువ. ఎన్నికలకు ముందు జగన్‌ కూడా వీరికి హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులు,  టైలర్లు,  రజకులకు ఆర్థిక సాయం అందిస్తానన్నారు. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించారు. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక అమలు చేశారని అంటోంది వైసీపీ. 

 

జగన్ సర్కార్ ఏడాది పాలన పూర్తైన వేళ అన్ని అంశాలపైనా విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో రెండో ఏడాది కూడా సంక్షేమ బాట నుంచి పక్కకు వెళ్లడం లేదు. ఉన్నవాటిని కొనసాగిస్తూనే అమలు చేయని పథకాలను ఒకటి రెండు నెలల్లో పూర్తిచేస్తామని చెబుతోంది ప్రభుత్వం. నవరత్నాలను అమల్లోకి తేవడం ద్వారా సంపూర్ణంగా మాట నిలబెట్టుకున్న ఘనత దక్కించుకున్నామని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో వివిధ కుల వృత్తులను ఆదుకునే అంశంపైనా ఫోకస్‌ పెట్టారు. 

 

సీఎం జగన్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ  కసరత్తు మొదలు పెట్టింది. జగనన్న చేదోడు పథకం పేరుతో కుల వృత్తులు చేస్తూ ఉపాధి పొందుతున్న అర్హులైన లబ్దిదారులను గుర్తించే పని తుది దశకు చేరుకుంది. ఇందులో నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు లబ్ధి చేకూరనుంది. 

 

ఆర్థిక లబ్ది పొందే అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ వలంటీర్ల ద్వారా జరుగుతోంది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు సర్వేలు కూడా జరిగాయి. జగనన్న చేదోడు పదకం కింద రెండున్నర లక్షల మందితో లిస్టు సిద్ధం కాగా... రీ వెరిఫికేషన్‌ తర్వాత ఫైనల్‌ జాబితా తయారు కానుంది. వచ్చే నెల 10న అర్హుల బ్యాంక్ ఖాతాల్లో పదివేలు లెక్కన జమచేయనున్నారు. దీనిపై చేతివృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా  అర్హులైన ప్రతి ఒక్కరికీ... ప్రతి పేదవాడికీ సంక్షేమ పధకాలు అందేలా చూడడమే తమ లక్ష్యమంటోంది ఏపీ ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: