రెండు నెలల తర్వాత దేశంలో విమానాలు మళ్లీ నింగిలోకి ఎగిరాయి. తొలి విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి పుణెకు చేరుకుంది. దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న తరుణంలో.. విమానయాన శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని విమానాశ్రయాల్లో దేశీయ టెర్మినల్ ల దగ్గర భద్రత ప్రమాణాలు పాటించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన క్వారంటైన్ నిబంధనలు గందరగోళానికి తెరతీశాయి. 

 

ఎట్టకేలకు దేశీయ విమాన ప్రయాణాలు మొదలయ్యాయి. చాలా రోజుల తర్వాత విమాన సర్వీసులు తెరుచుకోవడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. తొలి విడతలో ఎక్కువగా పారామిలిటరీ సిబ్బంది, సైనిక దళాలకు చెందిన వారు, విద్యార్థులు, వలస కార్మికులు ఉన్నారు. రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడంలో విఫలమైనవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానికంగా ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో విమానాశ్రయాలకు చేరకోవడానికి చాలా ఖర్చు చేయాల్సి వచ్చిందని కొంతమంది ప్రయాణికులు వాపోయారు. ఆయా విమానాశ్రయాల్లో ఫుడ్ ఔట్‌లెట్లు కూడా తెరుచుకున్నాయి.  ప్రయాణికులందరికీ ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే విమానాశ్రయాల్లో సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది సైతం ప్రత్యేక రక్షణా కిట్లను ధరించి విధులకు హాజరయ్యారు. ప్రయాణికులు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించారు.

 
      
ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో విమాన సేవల్ని పునరుద్ధరించారు. ఏపీలో బుధవారం నుంచి, పశ్చిమ బెంగాల్‌లో గురువారం నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో తొలి రోజు 125 టేకాఫ్ తీసుకోగా.. 118 విమానాలు ల్యాండయ్యాయి. ఢిల్లీ నుంచి తొలి విమానం పుణెకు వెళ్లింది. అయితే 82 విమానాలు చివరి నిమిషంలో రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆఖరి నిమిషం వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వివిధ రాష్ట్రాలు తాము విమానాలు అనుమతించంలేమని కేంద్రానికి చెప్పడంతో.. అనుకోని ఇబ్బంది వచ్చిందని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలిపాయి. 

 

దేశంలో రెండో బిజీ ఎయిర్ పోర్ట్ ముంబైలో 25 విమానాల టేకాఫ్, 25 విమానాల ల్యాండింగ్ కు మాత్రమే అనుమతించారు. ముంబై నుంచి తొలి విమానం పట్నాకు వెళ్లింది. ముంబైలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్న తరుణంలో.. పూర్తిస్థాయి విమానాల రాకపోకలకు మరింత సమయం పడుతుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో కూడా విమానాలు రద్దు కావడంపై.. ప్రయాణికులు నిరసన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని గౌహతి, ఇంఫాల్ ఎయిర్ పోర్టులతో పాటు బెంగళూరులో కూడా 9 విమానాలు కేన్సిల్ అయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు దేశీయ విమాన సర్వీసుల్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి పరిమితం చేయాలని కేంద్రాన్ని కోరాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కేవలం 30 విమాన సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

 

విమాన ప్రయాణీకులను క్వారంటైన్‌లో ఉంచడంపై పలు రాష్ట్రాలు విడుదల చేసిన మార్గదర్శకాలు భిన్నంగా ఉండటంతో గందరగోళం తలెత్తుతోంది. విమానాల్లో తమ రాష్ట్రాలకు చేరుకునే ప్రయాణికులకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్‌ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్‌  నిబంధనలను ప్రకటించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని కొన్ని రాష్ట్రాలు పేర్కొన్నాయి. గృహ ఏకాంతవాసంలో  ఉండాలని మరికొన్ని సూచించాయి. ప్రయాణీకులంతా 14 రోజులపాటు ఇంటికే పరిమితమవ్వాలని కేరళ, పంజాబ్‌ నిర్దేశించాయి. తమ రాష్ట్రానికి వచ్చేవారిని స్వీయ చెల్లింపు క్వారంటైన్‌లో రెండు వారాలపాటు ఉంచుతామని బిహార్‌ తెలిపింది. ప్రయాణికులకు 14 రోజులు అడ్మినిస్ట్రేటివ్‌ క్వారంటైన్‌ తప్పనిసరి అని  జమ్మూ-కశ్మీర్‌ పేర్కొంది. తమ రాష్ట్రానికి వచ్చేవారు 7 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో, మరో 7 రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని అసోం స్పష్టం  చేసింది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజులపాటు  ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని, తర్వాత మరో ఏడు రోజులు ఇంటికే పరిమితమవ్వాల్సి ఉంటుందని కర్ణాటక తెలిపింది.

 

ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చేవారు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. మరోవైపు- ప్రయాణికులంతా తాము వెళ్లే రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య ప్రొటోకాల్‌లను  ముందే చదవాలని విమాన సంస్థలు సూచించాయి. ఆయా రాష్ట్రాల నుంచి వెనక్కి రావాల్సి వచ్చినా, వాటిలో క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చినా తమకు  సంబంధం లేదని స్పష్టం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: