జగన్ రాజకీయంగా అమాయకుడు అని ఆడంబర వాచాలత్వం ప్రదర్శించేవారి మాట. జగన్ తెలివైనవారు అన్నది రాజకీయాలను అటూ ఇటూ చూస్తున్న విశ్లేషకుల భావన. జగన్ కంటే బాబు తెలివైన వారు అని కొందరు అంటారు కానీ బాబు అంటే కూడా జగన్ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు అని అనే వారూ ఉన్నారు. పదేళ్ల పాటు ఏ రాజకీయ   అండా  లేకుండా ఒంటరిగా పోరాడి తాను అనుకున్న ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం అంటే తమాషా కాదు కదా. అందుకే జగన్ బాబుని మించారని చెప్పాలి.

 

ఇక పాలన జగన్ కి ఏమి తెలుసు అన్నారు. జగన్ కి ఏమి అనుభవం ఉందని అన్న వారూ ఉన్నారు. జగన్ మంత్రి గా కూడా కనీసం పనిచేయలేదు కదా. కేవలం ఎంపీగా, ఎమ్మెల్యెగా, విపక్ష నేతగా మాత్రమే పనిచేశారు, కాబట్టి ఆయనకు పాలన చేతకాదు అన్న వారూ టీడీపీ వారే. కానీ టీడీపీని స్థాపించిన అన్న నందమూరి తారకరాముడికి ఏం అనుభవం ఉంది. అయినా సరే అద్భుతంగా పాలన చేశారు కదా. పేదల వైపునకు ప్రభుత్వాన్ని నడిపించారు కదా.

 

ఇక ఎన్టీయార్ తో పోలిస్తే జగన్ ఇంకా రాటుదేలిన వారే. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు. ఢక్కా మెక్కీలన్నీ ముందే తిన్నారు కాబట్టి ఇపుడు ఎక్కడా తడబడకుండా ముందుకు సాగుతున్నారు. ఇక ఏడాది పాలనలో జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా లాంటి అరుదైన ప్రపంచ మహమ్మారిని కూడా డీల్ చేశారు. 

 

విపక్షాలు చేసే ఎన్నో ఉద్యమాలను కూడా ఎదుర్కొన్నారు. అలాంటి జగన్ ఇపుడు ఏ అవకాశం విపక్షానికి ఇవ్వడంలేదు అన్న మాట వినిపిస్తోంది. ప్రతీ చిన్న దానికీ లొల్లి చేసే విపక్షాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తున్నారు. తన గోల్ మాత్రం మరచిపోవడంలేదు. జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూపోతున్నారు. మొదటి ఏడాదిలో చూస్తే జగన్ పాలనకు బాగానే మార్కులు పడుతున్నాయి.

 

విపక్షం అంతా ఒకటి, జగన్ ఒక్కటి అన్నట్లుగా ఏపీ పొలిటికల్ సీన్ ఉంది. ఇది రాను రాను ఎంత ముదిరితే అంతగా జగన్ కి కలసివచ్చే అవకాశాలే ఉన్నాయి. జగన్ నచ్చిన వాళ్ళకు ఆయన ఓటు అలాగే పడుతుంది. నచ్చని ఓటు చీలిపోతే విపక్షమే ఇబ్బందుల్లో పడుతుంది. మొత్తానికి జగన్ ఇప్పటికైతే విపక్షాన్ని పరుగులు పెట్టిస్తున్నారు తప్ప అసలు దొరకడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: