నారా చంద్రబాబునాయుడు.. తెలుగు రాజకీయాల్లో విస్మరించలేని పేరు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం జనం మధ్య ఉంటారన్న పేరున్న నాయకుడు. అధికారంలో ఉంటే.. సీఎంగా బిజీబిజీ.. ప్రతిపక్షనేతగా ఉంటే.. ప్రజాసమస్యలపై పోరాటం పేరుతో బిజీబిజీ.. అలాంటి తీరిక లేని వ్యక్తి.. తొలిసారిగా దాదాపు 2 నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లోని ఇల్లు వదిలి ఎక్కడకూ వెళ్లలేదు.

 

 

ఇలా దాదాపు 2 నెలలు ఇంటికే పరిమితం కావడం చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఇదే ప్రథమంగా చెబుతున్నారు. మరి ఆయన ఎందుకు రెండు నెలలు ఇంటిలోనే ఉండిపోయారు. మిగిలిన పార్టీల నేతలు జనంలోకి వచ్చారు కదా. మరి ఇందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని పరిశీలిస్తే.. వైసీపీ నేతలు మాత్రం ఓ సమాధానం చెబుతున్నారు. ఏపీలో కరోనా ప్రభావం తగ్గడంవల్లే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాగలిగారని చెబుతున్నారు.

 

 

ఇంతకాలం హైదరాబాద్ లోని తన ఇంటిలో గడిపిన చంద్రబాబు...ప్రజల వద్దకు వెళితే ఎక్కడ కరోనా సోకుతుందో అన్న భయంతోనే ఇంతకాలం బయటకు రాలేదని మంత్రి బాలినేని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో కరోనా తగ్గిందన్న అభిప్రాయం, నమ్మకం కలగడంతో చంద్రబాబు ఎట్టకేలకు రాష్ట్రానికి వచ్చారని బాలినేని వ్యంగ్యంగా అన్నారు.

 

 

ప్రతిపక్షం కోర్టు తీర్పులు, మీడియాను అడ్డు పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బాలినేని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ టూర్‌ ఎంచుకున్నారని విమర్శించారు. ఏదేమైనా చంద్రబాబు మళ్లీ అమరావతికి వచ్చేశారు. రెండు నెలల గృహవాసం వీడి మళ్లీ జనం మధ్య కనిపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: