ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినా మాస్కులు ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఏపీ డీజీపీ అనుమతితో నిన్న హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారు. 
 
డీజీపీ ఇచ్చిన ప్రత్యేక అనుమతులతో కారులో బయలుదేరిన చంద్రబాబు, చంద్రబాబు తనయుడు లోకేశ్ నిన్న మధాహ్నం ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే పలు చోట్ల చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు జన సమీకరణ చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు మాస్కులు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా హడావిడి చేసేందుకు ప్రయత్నించారు. 
 
పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నించినా టీడీపీ కేడర్ లెక్క చేయలేదని తెలుస్తోంది. గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర, నందిగామ, కంచికర్ల దగ్గర టీడీపీ నేతలు జనాలను సమీకరించారు. పార్టీ జెండాలు పట్టుకుని మూకుమ్మడిగా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నా చంద్రబాబు కార్యకర్తలను వారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 
 
గుంటూరు జిల్లాలోని ఉండవల్లి దగ్గరకు చంద్రబాబు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటంతో హైకోర్టు న్యాయమూర్తి కారును పెనుమాక మీదుగా ఉండవల్లి మార్గంలో మళ్లించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై హైకోర్టుకు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని సుమోటాగా పరిగణించి చంద్రబాబు, లోకేశ్ పై కేసులు నమోదు చేయాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: