గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ భూముల అమ్మకాల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. టీటీడీ దాదాపు 50 ఆస్తులను విక్రయించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల నుంచి, భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూములు విక్రయించడానికి గల కారణాలను వివరించినా ఈ వివాదం సద్దుమణగలేదు. అయితే నిన్న ఏపీ ప్రభుత్వం టీటీడీకి చెందిన భూములను విక్రయించాలన్న తీర్మానాన్ని నిలిపివేసింది. 
 
భూముల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న టీటీడీ ట్రస్ట్ బోర్టు తమకు చెందిన 50 ఆస్తులను విక్రయించాలని నిర్ణయం తీసుకుని చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విమర్శలు వ్యక్తం చేయడం, భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా భూములను విక్రయిస్తే భవిష్యత్తులో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని భావించి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ వ్యవహారంపై తుది నిర్ణయం ప్రకటించనుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఆయా స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
టీటీడీ బోర్డు కొన్ని రోజుల క్రితం గత తీర్మానానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడం... జగన్ సర్కార్ కు సొంత పార్టీలోనే కొందరు నేతలు భూముల విక్రయంపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వం తీర్మానాన్ని వాయిదా వేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: