ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంటే మరోవైపు భానుడి ఉగ్ర రూపానికి రాష్ట్రం విలవిల్లాడుతోంది. విశాఖ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఉక్కపోత, వేడిగాలులు కొనసాగుతాయని ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
వాతావరణ శాఖ రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రకటన చేసింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు 27వ తేదీన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఉపరితల ద్రోణి, ఆవర్తనం కారణంగా మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కూడా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన చేసింది. పలు జిల్లాల్లో వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోడ్లపైకి వచ్చిన వారు ఎండలను చూసి హడలిపోతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. 
 
అధికారులు వృద్ధులు, పిల్లలు, రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. వేడిగాలులు తీవ్ర ప్రభావం చూపుతాయని, వడదెబ్బల భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోస్తాలోని పలు జిల్లాల్లో కూడా ఎండలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను మించాయని తెలుస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: