ఏపీ సీఎంగా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. మరి ఆయన సాధించిందేంటి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన ఉందా.. ఏడాది పాలన సందర్భంగా జగన్ మేధోమథన సదస్సులు నిర్వహిస్తున్నారు. మరి జగన్ ఏడాది పాలనను ఓసారి పరిశీలిద్దాం.

ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. ప్రజలకు మరింత అందుబాటులో పాలన ఉండేందుకు జగన్ తక్కువ కాలంలోనే కొత్త వ్యవస్థలను అందుబాటులో తెచ్చారు. అవే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు.

 

 

ఇప్పుడు గ్రామ వాలంటీర్లు.. పాలనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. వాలంటీర్ తనకు అప్పగించిన 50 కుటుంబాలకు జవాబుదారీగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో వాలంటీర్ల వ్యవస్థ విజయవంతమైందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలని జగన్ వారిని ఆదేశించారు.

 

 

ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన చాలా సులభమైంది. ఏ సమాచారం కావాలన్నా అధికారులకు చిటికెలో లభిస్తోంది. మొన్నటికి మొన్న కరోనా కట్టడిలో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గతంలో ఏవో కాకి లెక్కల ద్వారా ఉజ్జాయింపు గణన ద్వారా ప్రభుత్వ పథకాలు రూపొందేవి. లబ్దిదారుల జాబితాలు రూపొందేవి. కానీ ఇప్పుడు పకడ్బందీగా పాలన సాగేందుకు వాలంటీర్లు పునాదులుగా మారారు.

 

 

ఈ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే అంటూ మొదట్లో టీడీపీ నానా హడావిడి చేసింది. కానీ దాన్ని నిరూపించడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు అక్కడక్కడా వాలంటీర్లపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేస్తోంది. మరి వాలంటీర్లంతా వైసీపీ వారే అయితే వారిపై వారే దాడులు చేసుకుంటారా.. టీడీపీ డొల్లవాదనలకు ఇదో నిదర్శనంగా మారింది. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ జగన్ ఏడాది పాలనలో విప్లవాత్మక మార్పుగానే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: