రెండు వారాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు పది రోజులపాటు 20 లోపే కరోనా కేసులు నమోదు కాగా రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చిందని ప్రజలు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 62 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1920కు చేరింది. నిన్న కరోనా భారీన పడి ముగ్గురు మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 56కు చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. 
 
రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. రేపు మధాహ్నం సీఎం కేసీఆర్ లాక్ డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ గురించి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించిన అంశాలను గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు గురించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని... ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. రోహిణీ కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి తుది కార్యాచరణ ప్రకటించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: