రాయలసీమ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. నీటి వసతి లేక నిత్యం కరవుతో అల్లల్లాడిన ప్రాంతం. కృష్ణా, గోదావరి రెండూ ఉప్పొంగినా రాయలసీమలో నీటి వెతలు మాత్రం తప్పవు. ఇందుకు కారణం.. రాయలసీమకు నీటిని తీసుకెళ్లే సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే. రాయలసీమకు నీటిని అందించే పోతిరెడ్డి పాడు సామర్థ్యం చాలా తక్కువ. అది కూడా శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటేనే నీటిని తీసుకెళ్లడం కుదురుతుంది.

 

 

అందుకే ఇప్పుడు జగన్ సర్కారు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతోంది.ఇది తెలంగాణ ఆగ్రహానికి కారణమైంది. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నట్టున్నాడు. అందుకే మేధోమథన సదస్సులో ఈ విషయంపై గట్టిగానే మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే.. “ శ్రీశైలంలో 885 అడుగులు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్, కానీ పోతిరెడ్డిపాడు 44 వేల క్యూసెక్కులు డ్రా చేసే పరిస్థితి.. నీరు 881 అడుగులు ఉంటే మాత్రమే డ్రా చేయగలం. శ్రీశైలం 854 అడుగులకు పడిపోతే డ్రా చేసే సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు పడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రాయలసీమలో కరువు ఎప్పుడు తీరుతుంది.

 

 

ఆల్‌మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు కర్ణాటకలో పెంచుతున్నారు. పైరాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నాయి. మన దగ్గరకు వచ్చే వరద నీరు ఎన్ని రోజులు ఉంటాయని చూస్తే కేవలం 10 రోజులు మాత్రమే. 881 అడుగులు పది రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. అన్ని ప్రాజెక్టులు 800 అడుగుల్లోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి వారు పవర్‌ జనరేషన్‌ 796 అడుగులకు రాగానే పవర్‌ జనరేషన్‌ మొదలుపెడుతున్నారు. ఏరకంగా ప్రాజెక్టులు బతుకుతాయి.

 

 

ఏరకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు వస్తాయని ఆలోచన చేస్తేనే మనసుకు కష్టం అనిపిస్తుంది. అందుకనే పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 800 అడుగుల్లో వారు ఆపరేట్‌ చేస్తున్న పంపులతో.. మనం కూడా 800 అడుగుల్లో మనం కూడా 3 టీఎంసీలతో పంపులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఉంటాం. మన నీళ్లు మనం.. వారి నీరు వాళ్లు తీసుకుంటారు. ఎవరికీ అన్యాయం జరగదు... అంటూ తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టేశాడు జగన్. నిజంగా ఇది జరిగితే రాయలసీమ పాలిట జగన్ దేవుడు అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: