జగన్ సర్కారు మరో వరం ప్రకటించింది. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధితో పలువురు మరణిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జగన్ దృష్టి పెట్టారు. అత్యవసరంగా ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే.. గిరిజన ప్రాంతాల్లో మరణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

 

 

ఏజెన్సీలో కాళ్ల వాపు వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు కాళ్ల వాపు వ్యాధితో 14 మంది మృతి చెందారని, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి ఆళ్లనాని చెప్పారు. తూర్పు ఏజెన్సీలో ఇప్పటికే 45 విలేజ్‌ క్లినిక్‌లు ఉన్నాయని, మరో 20 క్లినిక్‌లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. చింతూరు ఏరియా ఆస్పత్రిని త్వరలో వంద పడకల ఆస్పత్రిగా మార్చుతామన్నారు.

 

 

తూర్పు మన్యంలోని గిరిజన ప్రాంతాల్లో కాళ్ల వాపు వ్యాధి నివారణపై కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో క‌లిసి మంత్రి ఆళ్ల నాని స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లోనే ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని, పలు గ్రామాలను హాట్‌ స్పాట్లుగా గుర్తించామన్నారు. బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి, నివేదికల ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం సేకరించిన 103 మంది శాంపిల్స్‌లో 16 మందికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు.

 

 

ఏజెన్సీలో కాళ్ల వాపుపై రెండో దశ సర్వే రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు ఏజెన్సీలో అదనంగా మరో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. రక్షిత మంచి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన గిరిజన గ్రామాల్లో యూవీ వాటర్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: